పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు తొలి ప్రాధాన్యత
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
72 మంది లబ్ధిదారులకు రూ.66,56,190ల సహాయం
కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు 1,464 మందికి రూ.12,16,40,751లు ఆర్థిక సహాయం
అవనిగడ్డ, ఆంధ్రప్రభ: పేదల వైద్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.66,56,190ల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పార్టీ భేదం లేకుండా పేదల వైద్య అవసరాలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, అవసరమైన వారికి తక్షణ సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు నియోజకవర్గంలో 1,464 మందికి మొత్తం రూ.12,16,40,751ల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన వెల్లడించారు. పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
లబ్ధిదారుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
