Indrakeeladri | కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి…

  • ఆషాఢ సారె సమర్పణలతో కనకదుర్గమ్మ ఆలయం భక్తిజన సందోహం
  • సామాన్య భక్తులకే ప్రాధాన్యం.. తాత్కాలికంగా వీఐపీ దర్శనాలు నిలిపివేత
  • ఒక్కరోజే 50,739 మంది అమ్మవారి దర్శనం..
  • 12,100 మందికి అన్నప్రసాదం
  • ‘ధర్మపథం’లో భరతనాట్య నృత్యార్చన..
  • సీసీఎల్‌ఏ జయలక్ష్మి ప్రత్యేక పూజలు


Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో ఆషాఢ సారె సమర్పించేందుకు, కనకదుర్గమ్మ దర్శనం కోసం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడగా, దేవస్థానం విస్తృత ఏర్పాట్లతో దర్శనాన్ని సజావుగా నిర్వహించింది.

అరదితో అంతరాలయం నిలిపివేత..

భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో సాధారణ భక్తులు వేగంగా అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించింది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

శుక్రవారం వివరాలు ఇలా..

దేవస్థానం గణాంకాల ప్రకారం శుక్రవారం 50,739 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 5,654 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. 89,256 ప్రసాదాలు విక్రయించగా, విరాళాల రూపంలో రూ.3,20,195 లభించాయి. 377 ప్రత్యేక సేవలు నిర్వహించగా, 1,799 మంది తలనీలాలు సమర్పించారు. 12,100 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

విస్తృత ఏర్పాట్లు..

దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ పర్యవేక్షణలో క్యూలైన్లలో తాగునీరు, ఉచిత ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాద వితరణతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కంట్రోల్ రూమ్ నుంచి వైర్లెస్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాల ద్వారా భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

అలరించిన భరతనాట్యం..

ఆలయంలో నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గుడివాడకు చెందిన సరితా నెహ్రు బృందం భరతనాట్య నృత్యార్చనతో అమ్మవారికి కళానీరాజనం సమర్పించింది. దేవీ మహిమను ప్రతిబింబించే నృత్య రూపకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, కార్యక్రమం అనంతరం కళాకారులను దేవస్థానం అధికారులు శేషవస్త్రం, ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.

అమ్మవారిని దర్శించుకున్న సిసిఎల్ఏ సెక్రటరీ..

అదే రోజు ఆంధ్రప్రదేశ్ సీసీఎల్‌ఏ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.