Aswapuram | పాఠశాలలపై పర్యవేక్షణ లోపం…..

Aswapuram | పాఠశాలలపై పర్యవేక్షణ లోపం…..

అశ్వాపురం, ఆంధ్రప్రభ : గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలపై సంబంధిత విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చిన‌ట్టుగా కనపడుతుందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంచే చేను మేస్తే కాసేవారన్న చందంగా ఏజెన్సీ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు కనబడుతోంది.

మారుమూల ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల పై విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షణ విధిగా చేపట్టకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాలలోని ఆదివాసీ విద్యార్థులకు మెరుగైన విద్యాబుద్ధులు అందని ద్రాక్ష లాగే మారాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబుద్ధులు అందించి మెరుగైన లక్ష్యాల కోసం పనిచేయాల్సిన ఉపాధ్యాయులు వాటిని స్మరించి వేతనాల కోసం పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మండల పరిధిలోని ఎలకలగూడెం గ్రామంలో గల యుపిఎస్‌ పాఠశాలలో మొత్తం 27 మంది విద్యార్థులు ఉండగా వారికి విద్యాబుద్ధులు నేర్పేందుకు ఇక్కడి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది.

ఈ పాఠశాలలో బుధవారం ఓ ఉపాధ్యాయుడు సెలవు పెట్టడంతో ఒక్క ఉపాధ్యాయురాలే 20 మంది విద్యార్థులను చూసుకుంటుంది. ఉన్న ఇద్దరిలో ఒకరు సెలవు పెడితే ఐదు తరగతులకు ఒక్కరు ఏ విధంగా పాఠాలు బోధిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతోపాటు మండల కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉండడంతో ఇక్కడకి ఏ అధికారి వస్తాడులే అన్న ధీమాతో ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారని పలువురు అంటున్నారు.

ఎలకలగూడెం పాఠశాలలో మెనూకి ఎగనామం పెడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్నారు. బుధవారం ఆకుకూర పప్పుతో పాటు గుడ్డు పెట్టాల్సి ఉండగా గుడ్డు లేకుండానే సరిపెట్టారు ఆకుకూర పప్పు కూడా సాంబార్‌ ను తలపించే విధంగా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డించాల్సిన బాధ్యత ఉన్న వర్కర్లు ఎవరూ లేకపోవడంతో విద్యార్థులే భోజనం, కూరలు వడ్డించుకోవడం మరో విశేషం.

గోడల మీద మాత్రం మెనూ పట్టికలు రాస్తూ ఆచరణలో వాటిని అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు అంటున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్థానికంగా ఉండాల్సి ఉన్నప్పటికీ ఏ ఒక్కరు స్థానికంగా ఉండకుండా కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

నిబంధనల ప్రకారం పాఠశాల పరిధిలో ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిబంధనలకు పాతర వేసి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగిస్తూ వారికి రావలసిన అలవెన్స్‌ లను గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వం నుండి పొందుతున్నార నితెలుస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అనునిత్యం పర్యవేక్షణ చేపట్టి ఉపాధ్యాయులు స్థానికంగా ఉండే విధంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన విషయంలో మెనూ పాటించేలా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a Reply