Asia Cup | మహిళా ప్రత్యేకం క్రీడా ఉత్సాహం..

Asia Cup | మహిళా ప్రత్యేకం క్రీడా ఉత్సాహం..

సైకిల్ ర్యాలీ, క్రీడా ప్రదర్శనలు మహిళా క్రీడాకారిణులకు ఘన సత్కారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..

Asia Cup | విజయవాడ, ఆంధ్రప్రభ : స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆదివారం సైకిల్ ర్యాలీ, క్రీడా ప్రదర్శనలు, మహిళా క్రీడాకారిణుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహిళల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే కాకుండా క్రీడల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా సైకిల్ ర్యాలీతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. క్రీడా ప్రాధికార సంస్థ ఉపాధ్యక్షురాలు, నిర్వహణాధికారి ఎస్. భరణి, బోర్డు సభ్యులు రజని ఎతిమరుపు, సంతోష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

పాల్గొన్న క్రీడాకారులు, క్రీడాభిమానులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి స్టేడియం వరకు సైకిళ్లపై ప్రయాణిస్తూ ఆరోగ్య పరిరక్షణ, సక్రియ జీవనశైలిపై అవగాహన కల్పించారు. తదుపరి కార్యక్రమంలో ‘ఆరోగ్య భారత్’ ప్రతిజ్ఞను ఎస్. భరణి ఇంగ్లీషులో, రజని ఎతిమరుపు తెలుగులో చదివించారు. అనంతరం పలు క్రీడా ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు సంప్రదాయ కర్రసాము ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. తైక్వాండో కోచ్ విజయ్ కుమార్, ఆయన బృందం స్వీయరక్షణ ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా ఆరోగ్య వ్యాయామ కార్యక్రమాలు కూడా నిర్వహించి పాల్గొన్న వారిలో ఉత్సాహాన్ని నింపారు.

Asia Cup |
Asia Cup |

Asia Cup | ప్రతిభ కనబరిచిన మహిళా క్రీడాకారిణులకు సత్కారం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా క్రీడాకారిణులను ఘనంగా సన్మానించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మా తామిరి, జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన కెనూ స్లాలోమ్ క్రీడాకారిణి ఎన్. గాయత్రి, ఆసియా కప్ పోటీల్లో మూడు కాంస్య పతకాలు సాధించిన విలువిద్య క్రీడాకారిణి బుదే శణ్ముఖ నాగ సాయి తదితరులను ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు జిల్లాకు చెందిన 82 ఏళ్ల మాస్టర్స్ అథ్లెట్ వెంకట సుబ్బమ్మను ప్రత్యేకంగా సత్కరించారు.

Asia Cup |
Asia Cup |

ఈ వయస్సులో కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమెను ప్రేక్షకులు ప్రశంసలతో అభినందించారు. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మా తామిరికి క్రీడా ప్రాధికార సంస్థ తరఫున రూ.1.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అలాగే సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు చొరవతో సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు రూ.2 లక్షల నగదు బహుమతిని క్రీడాకారిణులకు అందించారు.

Asia Cup |
Asia Cup |

క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి…

ఈ సందర్భంగా ఎస్. భరణి మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో పాల్గొనడం యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఎంతో అవసరమని అన్నారు. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. మహిళా క్రీడాకారిణుల విజయాలను గుర్తించి సత్కరించడం ద్వారా మరెక్కువ మంది బాలికలు క్రీడల వైపు ఆకర్షితులవుతారని తెలిపారు. రజని ఎతిమరుపు తన క్రీడా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ పాఠశాల దశలో హాకీ ఆడటం నుంచి కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగానని చెప్పారు.

Asia Cup |
Asia Cup |

ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా పట్టుదల, కుటుంబ సహకారం వల్లనే విజయాన్ని సాధించగలిగానని తెలిపారు. యువతులు తమపై నమ్మకం ఉంచుకుని క్రీడల్లో అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు.

Asia Cup |
Asia Cup |

సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలు అన్ని రంగాల్లో, ముఖ్యంగా క్రీడల్లో చురుకుగా పాల్గొనడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు, కోచ్‌లు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం క్రీడాభిమానుల్లో విశేష ఉత్సాహాన్ని నింపింది.

CLICK HERE TO READ MORE : cm| ఉక్కు మహిళ సోనియ‌మ్మ సంకల్పంతోనే తెలంగాణ

CLICK HERE TO READ MORE :

Leave a Reply