మెట్ట రైతుల పంపుసెట్లకు విద్యుత్ పునరుద్ధరించాలి

సీఎం‌కు వల్లభనేని వంశీ లేఖ

గన్నవరం, ఆంధ్రప్రభ : తీవ్ర వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న మెట్ట రైతాంగ సాగునీటి అవసరాల కోసం పంపు చెట్లపై ఆధారపడుతున్నారని వారికి వెంటనే విద్యుత్ ను పునరుద్ధరించాలని గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ విజ్ఞప్తి చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ, పోలవరం కుడి ప్రధాన కాలువ (పీఆర్‌ఎంసీ) నుంచి మెట్ట ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో వేలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే సాగులో ఉన్న ఖరీఫ్ పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని, రైతుల జీవనాధారం సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

వీరపనేనిగూడెం, కొత్తగూడెం, టెంపల్లి, గొల్లనపల్లి, బల్లిపర్రు, రేమల్లె, సీతారాంపురం, నున్న తదితర గ్రామాలకు చెందిన రైతులు గత 12 ఏళ్లుగా ప్రభుత్వ అనుమతులతోనే కాలువ నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా ఎత్తిపోసుకుని సాగు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విధానం ప్రభుత్వ శాఖల పర్యవేక్షణలోనే కొనసాగిందని, అదే నమ్మకంతో రైతులు మోటార్లు, పైప్‌లైన్లు తదితర సాగు సౌకర్యాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారని వివరించారు. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాను ఒక్కసారిగా నిలిపివేశారని, దీనిపై రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, నిర్ణయానికి సంబంధించిన సాంకేతిక నివేదికలు లేదా కారణాలను కూడా వెల్లడించలేదని వంశీ ఆరోపించారు.

రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమే అయినప్పటికీ, మెట్ట ప్రాంత రైతుల సాగును పూర్తిగా నిలిపివేయడం పరిష్కారం కాదన్నారు. పంపింగ్ గంటల నియంత్రణ, మోటార్ల సామర్థ్య పరిమితి, నీటి పంపిణీ షెడ్యూల్, సాంకేతిక పర్యవేక్షణ వంటి శాస్త్రీయ విధానాల ద్వారా ఇరు ప్రాంతాల రైతుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని సూచించారు.

అర్హులైన రైతుల పంపుసెట్లకు తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని, ఉన్నత స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలని, పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి మెట్ట ప్రాంతాలకు నీటి ఎత్తిపోతలపై శాశ్వత విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటికే పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు తగిన పరిహారం అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ లేఖకు ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, వందలాది మంది రైతుల సంతకాలను జత చేసినట్లు తెలిపారు.