ఆషాడ కృత్తిక మహోత్సవాలు…
మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆషాడ కృత్తిక (ఆడికృత్తిక) సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీ స్వామి వారి పవిత్రోత్సవాలు రెండవ రోజు బుధవారం ఆషాడ బహుళ సప్తమి సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉదయం 8.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు గోపూజ, సుప్రభాత సేవ, నిత్యార్చన, నవకుంభారోపణము, ఏకాదశ ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకము, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్ఠానములు మరియు హవనము, మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు పట్టు పవిత్రముల సమర్పణ, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పము తదితర విశిష్ట వైదిక కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, వేదపండితులు, అర్చక స్వాములు, దేవస్థాన అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు.
