వినూత్నంగా ఆలోచించాలి…
సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు
పైడి భీమవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ప్రారంభం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలు వినూత్నంగా ఆలోచించి, వినూత్న ఆవిష్కరణలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గం, పైడి భీమవరంలో రూ.14.60 కోట్ల వ్యయంతో 1.99 ఎకరాల్లో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి మంగళవారం 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో సీఎం వర్చువల్ గా మాట్లాడారు. పైడి భీమవరం ఐడీఏలో లిక్విడ్ ఆక్సిజన్ పరిశ్రమను స్థాపించిన లిక్వినాక్స్ సంస్థ అధినేత రాజేష్ బాబు చేసిన సేవలను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. రాజేష్ బాబు మాట్లాడుతూ.. 2016 వీఎస్‌పీ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూ కుదుర్చుకున్నామని, ఆ తర్వాత 2019లో ఉత్పత్తి ప్రారంభించి, 2020లో కరోనా కష్టకాలంలో తమ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినట్లు వివరించారు. రిమ్స్, జెమ్స్, కేజీహెచ్ ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సిలిండర్ లను అందజేశామని వివరించారు.

ఈ కృషిని అభినందించిన ముఖ్యమంత్రి, విద్యార్థులు సైతం ఇప్పటి నుంచే వినూత్న ఆవిష్కరణల దిశగా ప్రయత్నించాలని సూచించారు. జిల్లాలోని సంత ఉరిటిలో వరి ఇతర పంటల వ్యర్థాల నుండి బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (Bio-compressed natural gas) ఉత్పత్తి చేసే పరిశ్రమను స్థాపిస్తున్నట్లు విజయనగరానికి చెందిన పి.వి.ఎస్. రామస్వామి తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని ప్రేరణగా తీసుకుని తాను ఈ పరిశ్రమకి అంకురార్పణ చేసామని, వీఎస్‌పీ సీఐఐ సదస్సులో ఎంఓయూ కుదుర్చుకోనున్నట్లు ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. వర్చువల్ ప్రారంభోత్సవం ముగిసిన అనంతరం, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవనాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వి రాజ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ సహా పలువురు అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

