యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

సుదర్శన క్రియతో మానసిక ప్రశాంతత సాధ్యమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సూచన

చిట్యాల, ఆంధ్రప్రభ : సుదర్శన క్రియను ప్రతిరోజూ చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు అన్నారు. ఆదివారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులకు సుదర్శన క్రియ, యోగ, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అందించిన సుదర్శన క్రియ ద్వారా మానవ జీవితంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని చెప్పారు. ప్రతి మనిషిలో అపారమైన శక్తి దాగి ఉందని, ఆ శక్తిని వెలికితీసేందుకు యోగ, ధ్యానం, సుదర్శన క్రియలు దోహదపడతాయని వివరించారు.

ప్రతి విద్యార్థి యోగను తన జీవితంలో భాగంగా మార్చుకుని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ప్రసాద్, ట్రైనర్ బోయ స్వామి నరేష్, విద్యార్థులు పాల్గొన్నారు.