Elections of handloom cooperative societies | ‘ముగ్గురు పిల్లల’ నిబంధన తొలగించాలి..

Elections of handloom cooperative societies | ‘ముగ్గురు పిల్లల’ నిబంధన తొలగించాలి..

  • వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి చేనేత నాయకుల వినతి
  • డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం భేటీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో ప్రస్తుతం అమలులో ఉన్న ముగ్గురు పిల్లల అనర్హత నిబంధనతో పాటు ఇతర ఎన్నికల పరిమితులను తక్షణమే తొలగించాలని కోరుతూ చేనేత సంఘాల నాయకులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే. సురేంద్ర మోహన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ మాజీ డైరెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చేనేత సహకార సంఘాల ఎన్నికలకు కూడా వర్తింపజేయాలని కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చేనేత కార్మికుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలంటే ఎన్నికల్లో అమలవుతున్న పరిమితులను తొలగించడం అవసరమన్నారు. చేనేత సంఘాల్లో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కే. సురేంద్ర మోహన్ ఈ అంశాన్ని సంబంధిత అధికారులతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించడంపై చేనేత కార్మికులు, సహకార సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో పోచంపల్లి హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ హౌస్ మాజీ డైరెక్టర్ భారత వాసుదేవ్, యాదాద్రి భువనగిరి జిల్లా నేలపట్ల పద్మశాలి చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply