తాత సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులే నాకు స్ఫూర్తి : ఘట్టమనేని జయకృష్ణ

  • మహేష్ బాబు మద్దతు మరువలేనిది.. భావోద్వేగానికి గురైన జయకృష్ణ
  • మహేష్ బాబు సూచనతో విజయవాడలో ట్రైలర్ విడుదల
  • కృష్ణకు నివాళులతో ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్ లాంచ్
  • ఫ్యాన్స్ గర్వపడే సినిమా ఇది.. ‘శ్రీనివాస మంగాపురం’పై అజయ్ భూపతి ధీమా

విజయవాడ, ఆంధ్రప్రభ: సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విజయవాడలోని అప్సర థియేటర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ట్రైలర్ విడుదల సందర్భంగా జయకృష్ణ, దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ రషా తడాని, నిర్మాతలు, ఎంపీ కేశినేని చిన్ని చిత్ర విశేషాలను వెల్లడించారు. హీరో జయకృష్ణ మాట్లాడుతూ.. తాత సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులే తనకు స్ఫూర్తి అని, ఆయన లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని భావోద్వేగానికి గురయ్యారు. తన బాబాయ్ మహేష్ బాబు సినిమా నిర్మాణం నుంచి ట్రైలర్ వరకు ప్రతి దశలో విలువైన సూచనలు, ప్రోత్సాహం అందించారని తెలిపారు. తండ్రి రమేష్ బాబును ఈ సందర్భంగా స్మరించుకుంటూ.. ఆయన ఈ వేడుకలో ఉంటే ఎంతో ఆనందించేవారని అన్నారు.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్ 100’ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తైన రోజునే ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్‌ను విజయవాడలో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం భావోద్వేగాలు, పాటలు, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ట్రైలర్ చూసిన మహేష్ బాబు తనకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారని వెల్లడించారు.

హీరోయిన్ రషా తడాని మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ సినిమాతో అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. జయకృష్ణ నటన, పాటలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఆయన మనవడు జయకృష్ణ కూడా ఈ చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. మహేష్ బాబు సూచన మేరకే విజయవాడలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. త్వరలో ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహిస్తామని వెల్లడించారు. అంతకుముందు లెనిన్ సెంటర్‌లోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి హీరో జయకృష్ణతో పాటు చిత్రబృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించింది. కార్యక్రమంలో నిర్మాత జెమినీ కిరణ్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న, సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం ప్రతినిధులు సీరం బుజ్జి, సుధా స్వామి తదితరులు పాల్గొన్నారు.