22aprilpahalgam | మరువని భారత్, వదలని సైన్యం!

22aprilpahalgam | మరువని భారత్, వదలని సైన్యం!

22aprilpahalgam | పహల్గామ్‌లో నెత్తురోడిన రోజు
ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన ప్రతీకారం
ఆపరేషన్ సింధూర్ ప్రభావం
పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఒత్తిడి
భారత సైన్యం హెచ్చరిక… హద్దులు దాటొద్దు

22aprilpahalgam ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాలం ఎన్నెన్నో గాయాలను మాన్పుతుంది అంటారు. కానీ, కన్నతల్లి లాంటి దేశం గుండెపై పడ్డ గాయంను కాలం కూడా ఎప్పటికీ చెరిపేయలేదు. పచ్చని కాశ్మీర్ లోయలో నెత్తురు పారిన రోజు అది. సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్‌లో జరిగిన ఆ విషాదం.. ఆ తర్వాత రగిలిన ప్రతీకార జ్వాల.. దాయాది దేశానికి మన ఇండియన్ ఆర్మీ ఇచ్చిన వణుకు.. ఇవాళ ఆ ఘటనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ వీరుల త్యాగాలను, మన ఆర్మీ తెగువను స్మరించుకుందాం.

22aprilpahalgam
22aprilpahalgam

నెత్తురోడిన పహల్గామ్..
పర్యాటకులపై ఉగ్ర పంజాకు నేటితో 12 నెలలు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన కిరాతక ఉగ్రదాడి జరిగి రేపటికి (బుధవారం) ఏడాది ముగుస్తుంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఆ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణంలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు కలిపి మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద జ్ఞాపకం నేటికీ దేశ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

శత్రువు గుండెల్లో ‘ఆపరేషన్ సిందూర్’ దడ..
పిరికిపంద ఉగ్రదాడికి భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చింది భారత్. ఉగ్రవాదుల చర్యతో యావత్ దేశం ఆగ్రహంతో రగిలిపోతున్న తరుణంలో, మోదీ ప్రభుత్వం అత్యంత రహస్యంగా, వ్యూహాత్మకంగా ‘ఆపరేషన్ సింధూర్’ను తెరపైకి తెచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సాయుధ దళాలు విరుచుకుపడ్డాయి. అత్యాధునిక ఆయుధాలతో కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను భారత సైన్యం నేలమట్టం చేసింది. ఈ మెరుపు దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి.

సింధూ నదీజలాల ఒప్పందం రద్దు..
ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసేందుకు భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా సరిహద్దుల్లో ఉగ్రకోటలను బద్దలుకొట్టిన మోదీ ప్రభుత్వం, దౌత్యపరమైన ముట్టడిని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న కీలక ఒప్పందాలను రద్దు చేస్తూ కఠిన ఆంక్షలు విధించింది. సింధూ నదీ జలాల విషయంలో గత ఆరు దశాబ్దాలుగా ఉన్న ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అనే నినాదంతో, పాకిస్థాన్‌కు వెళ్లే నదీ జలాలను నియంత్రించేలా కేంద్రం వ్యూహరచన చేసింది. పాక్ చర్యకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

హద్దులు దాటితే.. చరిత్ర పునరావృతమే!
పహల్గామ్ ఘటన జరిగి నేటికి (ఏప్రిల్ 22) సరిగ్గా ఏడాది పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఇండియన్ ఆర్మీ ఓ పవర్‌ఫుల్ పోస్ట్ను షేర్ చేసి, పాక్‌కు వెన్నులో వణుకు పుట్టించింది. “కొన్ని హద్దులు ఎప్పటికీ దాటకూడదు.. భారత్ ఎప్పటికీ మర్చిపోదు” అంటూ ఒక హెచ్చరిక బోర్డు లాంటి చిత్రాన్ని పంచుకుంది. ఇది కేవలం ఒక వార్షికోత్సవ పోస్ట్ కాదు, పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన, కఠినమైన వార్నింగ్. “మా సహనాన్ని చేతకానితనంగా భావించి మరోసారి హద్దులు దాటితే.. పరిణామాలు ఊహకు కూడా అందవు” అని భారత సైన్యం మరోసారి ప్రపంచానికి తేల్చిచెప్పింది.

Leave a Reply