AP Deputy CM | స్కైరూట్‌కు పవన్ అభినందనలు..
AP Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ‘మిషన్ ఆగమన్’ పేరుతో ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన తొలి రాకెట్ విజయవంతంగా ప్రయోగం కావడం చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని కొనియాడుతూ, ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్ల దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.
విక్రమ్-1 ప్రయోగాన్ని విజయవంతం చేసిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్ సంస్థల శాస్త్రవేత్తలు, సిబ్బందిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. వారి కృషి భారత అంతరిక్ష రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు. ఈ విజయం దేశ యువతకు స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తుందని, విజ్ఞాన సాంకేతిక రంగంలో మరింత మంది యువత ముందుకు రావడానికి ఇది ప్రేరణగా మారుతుందని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
