Godavari Pollution | నదిని కలుషితం చేస్తే కఠిన చర్యలే

Godavari Pollution | నదిని కలుషితం చేస్తే కఠిన చర్యలే

Godavari Pollution | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : గోదావరి నది కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో కాలుష్యానికి కారణమవుతున్న ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యానికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ ) అధికారులను ఆదేశించారు.

ఇటీవల రాజమహేంద్రవరంలో గోదావరి నది కాలుష్య పరిస్థితిని పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. ఆ సందర్భంగా సేకరించిన నీటి నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించగా, నిర్దేశిత పరిమితికి మించి ప్రమాదకర రసాయనాలు నదిలో కలుస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది.

నివేదికపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్.. “ఇంత భారీ స్థాయిలో కాలుష్యం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. నెలకోసారి నీటి నమూనాలు సేకరిస్తున్నామని అధికారులు సమాధానం ఇవ్వగా, “అయితే కాలుష్యం పెరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదు?” అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయడంలో విఫలమైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా నోటీసులు జారీ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పర్యవేక్షణలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. గోదావరి స్వచ్ఛతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply