ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు
రాయలసీమ ప్రతినిధిగా తిరుపతి కలెక్టర్‌కు సభ్యత్వం
తిరుపతి ప్రతినిధి – (ఆంధ్రప్రభ): ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది. అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం జరిగిన తొలి సమావేశానికి మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సెక్రటరీ ఎ. సూర్యకుమారి, వివిధ శాఖల అధికారులు, ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కలెక్టర్ బంగ్లా నుంచి వర్చువల్ విధానంలో సమావేశానికి హాజరయ్యారు. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్–2019, రూల్స్–2020 నిబంధనల మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 14 ప్రకారం బోర్డును ఏర్పాటు చేశారు. ఇందులో రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్‌కు సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బోర్డు ఛైర్‌పర్సన్‌గా విభిన్న ప్రభావంతులు, ట్రాన్స్‌జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వ్యవహరించనుండగా మెంబర్ సెక్రటరీగా మహిళలు, శిశువులు, విభిన్న ప్రభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ సూర్యకుమారి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆంధ్ర ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను నియమించారు. ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కోట ప్రేమ్ సాగర్ రాయ్, నక్కా జీవన్ కుమారి, బోను దుర్గ సభ్యులుగా ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు, చట్టాలు, కార్యక్రమాల రూపకల్పనలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, అమలవుతున్న పథకాల ప్రభావాన్ని సమీక్షించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందించడం, సమస్యలు మరియు ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టడం వంటి బాధ్యతలను ఈ బోర్డు నిర్వహించనుంది. రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్ సమాజానికి సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మరింత సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
