Amaravati HappyNest | వినూత్న, ఆధునిక నిర్మాణ విధానంతో ముందడుగు

Amaravati HappyNest | వినూత్న, ఆధునిక నిర్మాణ విధానంతో ముందడుగు
Amaravati HappyNest | అమరావతి నిర్మాణంలో అద్భుత ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయం
ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉన్న మివాన్ షట్టరింగ్ ప్రక్రియ
ఎత్తయిన భవనాలు, టౌన్‌షిప్ నిర్మాణంలో వేగవంతమైన పనులు
Amaravati HappyNest | అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాజధాని అమరావతి నిర్మాణంలో అద్భుత ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ దేశాల్లో వినియోగంలో ఉన్న మివాన్ షట్టరింగ్ ప్రక్రియతో భారీ భవనాలు, గృహనిర్మాణ ప్రాజెక్టులు, టౌన్షిప్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసే విధంగా సీఆర్డీఏ ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ప్రయోగాత్మకంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు పనుల్లో ఈ ప్రక్రియను అవలంబించనున్నారు.
మివాన్ షట్టరింగ్ అనేది ఆధునిక అల్యూమినియం ఫార్మ్‌వర్క్ సిస్టమ్. ముఖ్యంగా ఎత్తైన భవనాలు, భారీ గృహనిర్మాణ ప్రాజెక్టులు, టౌన్షిప్ నిర్మాణంలో వేగవంతమైన ఆర్‌సీసీ నిర్మాణ పనులకు దీన్ని వినియోగిస్తారు. ఈ సాంకేతికతను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ సంస్థలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి.
సాంప్రదాయ షట్టరింగ్ విధానంలో బీమ్లు, స్లాబ్లు, కాలమ్లు, ఇటుక గోడలు వేర్వేరుగా నిర్మించబడతాయి. అయితే ఈ సిస్టమ్‌లో గోడలు – స్లాబ్లను ఒకేసారి కాంక్రీటుతో నిర్మించడం ద్వారా ఒకే సమగ్ర ఆర్‌సీసీ నిర్మాణం రూపొందుతుంది. ఈ తరహా నిర్మాణ ప్రక్రియలో ముందుగా అల్యూమినియం ఫార్మ్‌వర్క్ ప్యానెల్లను అమరుస్తారు. అనంతరం రీన్ఫోర్స్మెంట్ స్టీల్ అమర్చడం, విద్యుత్ – ప్లంబింగ్ కండక్ట్‌ను ఏర్పాటు చేస్తారు. తరువాత గోడలు – స్లాబ్లకు ఒకేసారి కాంక్రీట్ పోయడం జరుగుతుంది.
సుమారు 12 నుంచి 24 గంటల్లో డీ-షట్టరింగ్ పూర్తి చేసి, అదే ప్యానెల్లను మరో అంతస్తు నిర్మాణానికి తిరిగి వినియోగించే అవకాశం ఉంటుంది. ఈ విధానం ద్వారా చాలా వేగంగా అంతస్తుల నిర్మాణం పూర్తి చేయవచ్చని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. సాధారణ ఆర్‌సీసీ నిర్మాణంలో ఒక అంతస్తు పూర్తి కావడానికి సుమారు 15 నుంచి 21 రోజులు పట్టగా, ఈ విధానంలో అదే పని 7 నుంచి 10 రోజుల్లో పూర్తవుతుంది.
మివాన్ విధానంతో నిర్మించిన గోడలు – స్లాబ్లు సమతుల్యంగా, మృదువుగా నాణ్యతా ప్రమాణాలతో రూపుదిద్దుకుంటాయి. దీంతో ప్లాస్టరింగ్, పుట్టీ పనులు తగ్గడంతో పాటు నిర్మాణ నాణ్యత సైతం మెరుగుపడుతుంది. ఈ విధానంలో వినియోగించిన అల్యూమినియం ప్యానెల్లను సరైన నిర్వహణతో సుమారు 200 నుంచి 300 సార్లు తిరిగి వినియోగించే అవకాశం ఉంది. ఈ విధానంలో భవన నిర్మాణం ఒకే సమగ్ర ఆర్‌సీసీ రూపం వల్ల భూకంప నిరోధకత స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది. జాయింట్లు తగ్గడం వల్ల లీకేజీ సమస్యలు సైతం తక్కువగా ఉంటాయి. నిర్మాణ పనులలో చెక్క/టింబర్ వినియోగం తగ్గడం, నిర్మాణ వ్యర్థాలు తగ్గడం, కాంక్రీట్ వినియోగం నియంత్రణలో ఉండడం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించారు.
హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ వ్యవస్థను జెనిసిస్ ప్లానర్స్ సంస్థ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. ఈ ఫార్మ్‌వర్క్‌ను మలేషియాకు చెందిన ఎంఎఫ్ఎస్ఈ ఫ్రేంవర్క్ టెక్నాలజీ సంస్థ తయారు చేసి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం హ్యాపీనెస్ట్‌లోని రెండు టవర్ల నిర్మాణ పనుల నిమిత్తం రెండు సెట్ల ఫార్మ్‌వర్క్ సామాగ్రి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు సైట్‌కు చేరుకుంది. త్వరలోనే మిగతా టవర్లకు సంబంధించి మివాన్ షట్టరింగ్ యంత్ర సామాగ్రి అమరావతికి రానుంది.
