ఉద్యమకారుల అరెస్టులతో ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన

ఉద్యమకారుల అరెస్టులతో ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన

ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్


నల్లబెల్లి, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే నెపంతో తెలంగాణ ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబరావు, జేఏసీ నల్లబెల్లి మండల చైర్మన్ వేముల రాజు, అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపకులు పరికి కోర్నేల్ మాదిగ ప్రభుత్వ తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, ప్రశంసాపత్రాలు, బస్సు-రైలు పాసులు, ఆరోగ్య భీమా వంటి హామీలు కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్లుగా శాంతియుతంగా హామీల అమలుకోసం పోరాడుతున్న ఉద్యమకారులను తీవ్రవాదుల్లా అరెస్టు చేయడం సరైంది కాదన్నారు.

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో పలువురు ఉద్యమకారులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 2లోపు హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఓదెల రవి, కొత్తగట్టు ప్రభాకర్,యన్నమల్ల నర్సయ్య తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.

Leave a Reply