ఫైల్ క్లియరెన్స్ లో…వారిద్దరూ టాపర్ లే ….!
ఫైల్ క్లియరెన్స్ లో…వారిద్దరూ టాపర్ లే ….!
భర్త కు ఫస్ట్ ర్యాంక్… భార్య కు సెకండ్ ర్యాంక్…!
భార్యాభర్తల పనితీరు ఇది…!
పల్నాడు ప్రతినిధి , ఆంధ్రప్రభ : వారిద్దరూ భార్యాభర్తలు… వేర్వేరు జిల్లాలకు కలెక్టర్లు… ఒకేరోజు కలెక్టర్ లుగా (2025-సెప్టెంబర్ లో) బాధ్యతలు స్వీకరించి తమ పనితీరుకు ర్యాంకులు సాధించిన వైనం ఇది. భార్యా భర్తలైన నెల్లూరు, పల్నాడు జిల్లా కలెక్టర్లు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా తమదైన మార్క్ చూపిస్తున్నారు. సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఫైల్ క్లియరెన్స్ లోను టాప్ లో ఉన్నారు. ఈ ఏడాది మార్చి 11 నుంచి మే 5వ తేదీ వరకు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి హిమాన్షు 4.59 గంటలు, కృతికా 7.65 గంటల సమయం తీసుకున్నారు. ఫైల్ క్లియరెన్స్ లో ఈ ఇద్దరు కలెక్టర్లు మొదటి రెండు ర్యాంకులు సాధించడం విశేషం. భర్తకు మొదటి ర్యాంకు రాగా, భార్యకు రెండో ర్యాంకు వచ్చింది. ఈ నెల 7, 8 తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమీక్షా సమావేశంలో వారికి ఈ ర్యాంకులు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా వారికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
