One Nation One Election | 2029 లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక కసరత్తు

One Nation One Election | 2029 లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మక కసరత్తు

One Nation One Election | వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై వేగవంతమైన చర్చలు
మంత్రివర్గ విస్తరణ, సంస్థాగత మార్పులపై దృష్టి
యూపీ, పంజాబ్‌లపై ప్రత్యేక ఫోకస్

One Nation One Election | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: హిందూత్వం, అయోధ్య, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ విజయం సాధిస్తున్న బీజేపీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు గెలిచిన బీజేపీ, నాలుగోసారి కూడా గట్టెక్కేలా ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలు పెడుతోంది.

ఇప్పటికే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. అలాగే 2029లో సైతం పూర్తి మెజార్టీ సాధించాలనే గట్టి పట్టుదలతో పార్టీ ముందుకు సాగుతోంది. 2024 ఎన్నికల్లో 400 ఎంపీ స్థానాలను గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లి బోల్తాపడటంతో, మరోసారి అలాంటి తప్పిదం జరగకుండా ముందస్తుగానే ఎత్తుగడలను అమలు చేస్తోంది.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను తీసుకురాబోతుండటంతో, వాటి ద్వారా లభించే రాజకీయ ప్రయోజనాలను ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. అన్ని సవ్యంగా సాగితే ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానాన్ని కూడా అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలను ఎదుర్కొనేలా పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సమర్థులను తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే గత ఆరు నెలలుగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ దఫా మాత్రం పక్కాగా అమలు చేసేలా అంతర్గత కసరత్తు పూర్తిచేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని చిన్నచిన్న మార్పులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో మోదీ 2.0 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. అరడజను మంది మంత్రులకు ప్రమోషన్ లభించగా, 30 మంది కొత్తవారు మంత్రివర్గంలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరింత పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయని హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి.

యూపీ టార్గెట్.. పంజాబ్‌పై పట్టు

బీజేపీ ప్రభుత్వానికి ఆయువుపట్టుగా ఉన్న ఉత్తరప్రదేశ్‌ను పదిలంగా కాపాడుకునేలా కేంద్రం ముందుకు సాగుతోంది. మంత్రివర్గ విస్తరణలోనూ, పార్టీ పదవుల భర్తీలోనూ యూపీకి ప్రాధాన్యం ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పంజాబ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఆ రాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించేలా వ్యూహాలు రచిస్తోంది.

ఇటీవల పార్టీ సంస్థాగత మార్పులు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో పార్టీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నేతల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. జూన్ 16న రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ నబీన్, బీఎల్ సంతోష్ దాదాపు నాలుగు గంటల పాటు సమావేశమై చర్చించారు.

ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత మార్పులు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ పదవులను కూడా పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నేషనల్ ఆఫీస్ బేరర్స్ సంఖ్యను 45 నుంచి 60కి పైగా పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ పార్లమెంటరీ బోర్డు, ప్రాంతీయ ఇన్‌ఛార్జీలు, రాష్ట్ర యూనిట్లు, నేషనల్ ఎగ్జిక్యూటివ్, నేషనల్ కౌన్సిల్‌లో కూడా మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.