25thJunechintana | శుక్రాచార్యుడి అడ్డంకులు, వామనుడి చాకచక్యం

25thJunechintana | శుక్రాచార్యుడి అడ్డంకులు, వామనుడి చాకచక్యం

25thJunechintana | వామనుడి యాచనకు బలి ఇచ్చిన మాట
కచుడు సాధించిన మృతసంజీవని విద్య
సంకల్పం, కర్తవ్యనిర్వహణతో నిలిచిన కార్యసాధకులు

25thJunechintana | ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా అడ్డు తగులుతుంటారు. అవాంతరాలన్నింటినీ మనోసంకల్పంతో అధిగమించి విజయం సాధించినవారే నిజమైన కార్యసాధకులు. దానవేశ్వరుడైన బలిచక్రవర్తి చెంతకు మరుగుజ్జు రూపంలో ఉన్న బ్రహ్మచారి వామనుడు వచ్చి మూడడుగుల నేల యాచిస్తాడు. ఆ వచ్చినది స్వయంగా నారాయణుడేనని గ్రహించిన అసుర గురువు శుక్రాచార్యుడు దానమివ్వవద్దని బలిని ఆదేశిస్తాడు. ఆయన ససేమిరా అంటూ గురువాజ్ఞను ధిక్కరిస్తాడు.

“ఆడిన మాట తప్పినవాడు, యుద్ధరంగంలో వెన్నుచూపినవాడు జీవించి ఉన్నా చనిపోయిన వ్యక్తితో సమానం. అందుకే నేను వాగ్దానభంగం చేయదలుచుకోలేదు” అని బలిచక్రవర్తి స్పష్టం చేస్తాడు. వామనుడికి అతిథి మర్యాదలకు ఉపక్రమిస్తారు బలిచక్రవర్తి దంపతులు. “గురువు మాట పెడచెవిన పెడితే రాజ్యభ్రష్టుడివి అవుతావు. తేజస్సు, యశస్సు కోల్పోతావు” అని శుక్రాచార్యుడు హెచ్చరిస్తాడు. అయినా ఆయన మాట వినకుండా దానధార వదిలేందుకు జలంతో నిండిన కలశాన్ని అందుకుంటాడు బలి.

శుక్రాచార్యుడు సూక్ష్మకీటకంలా మారి నీరు జారకుండా కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. దీన్ని గ్రహించిన వామనుడు దర్భపుల్లతో ఒక్క ఉదుటున కలశ రంధ్రంలో పొడవగా శుక్రాచార్యుడి కన్ను లొట్టపోయి ఏకనేత్రుడిగా మారాడు. వాస్తవానికి శుక్రాచార్యులవారు దేవతల పక్షానే ఉండేవారు. అలాంటి వ్యక్తి రాక్షసుల గురువుగా మారడం వెనుక పెద్ద కథే ఉంది. తొలుత అంగీరస మహర్షి వద్ద వేదవిద్యాభ్యాసం గావిస్తాడు. ఆయన తనపట్ల పక్షపాత ధోరణి చూపుతున్నారని భావించి ద్వేషం పెంచుకుంటాడు. తదుపరి గౌతమ మహర్షిని ఆశ్రయిస్తాడు. ఘోర తపస్సు గావించి శివుడి మెప్పు పొంది సంజీవని మంత్రాన్ని వరంగా పొందుతాడు.

ప్రియవతుని కుమార్తె ఉర్జస్వాతిని పరిణయమాడి ఐదుగురు పిల్లలతో సంసారం సాగిస్తుంటాడు. ఆ సమయంలో తాను శత్రువుగా తలిచే బృహస్పతి దేవతలకు గురువవుతారు. ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి ఒక రాక్షసుడిని వెంటాడుతూ వేటాడేందుకు బయలుదేరుతాడు. ఆ దానవుడికి శుక్రాచార్యుడి మాతృమూర్తి ఆశ్రయం ఇస్తుంది. ఆ కోపంలో ఆమెను విష్ణువు సంహరిస్తాడు.

హఠాత్పరిణామానికి కలత చెందిన శుక్రుడు విష్ణువుపై పగ పెంచుకుంటాడు. కోపం, కసి తనువులోని అణువణువునా జీర్ణించుకుపోయిన తరుణంలో క్షణికావేశంతో అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అనుకోవడమే తరువాయి గురువు స్థానం సంపాదిస్తాడు. దేవదానవ సంగ్రామంలో అసువులు బాసిన రాక్షసులందరినీ తాను పొందిన సంజీవని మంత్రంతో తిరిగి బతికిస్తుంటాడు. ఆ విధంగా ప్రతిసారీ దేవతల మీద రాక్షసులు విజయం సాధించడంలో శుక్రాచార్యులవారు కీలక పాత్ర పోషించేవారు.

దీన్ని జీర్ణించుకోలేని దేవతలు సంజీవని విద్యను నేర్చుకొని రావాలంటూ బృహస్పతి కుమారుడు కచుడిని పంపగా, అతడు శుక్రుడి వద్ద శిష్యరికం చేస్తాడు. ఈ క్రమంలో శుక్రుడి కుమార్తె దేవయానిని ప్రేమలో పడేలా చేసుకుంటాడు. శుక్రాచార్యుడు కచుడిపట్ల ఇష్టంగా ఉండడాన్ని చూసిన రాక్షసులు ఎన్నోసార్లు తమ గురువును మట్టుబెట్టాలని ప్రయత్నిస్తారు. ఎప్పటికప్పుడు దేవయాని తండ్రిని కాపాడుకుంటూ వస్తుంది. అసురుల కోపం తారస్థాయికి చేరడంతో కచుడిని దహనం చేసి, బూడిదను సుర (మద్యం)లో కలిపి శుక్రాచార్యులవారితో తాగిస్తారు.

దేవయాని కచుడి జాడ తెలియక రోదిస్తుండగా శుక్రుడు దివ్యదృష్టితో అసలు విషయం గ్రహించి మృతసంజీవని విద్యతో కచుడిని బతికిస్తాడు. పొట్టలోంచి బయటకు రావడానికిగాను ఆ విద్యను కచుడికి ఉపదేశించడంతో అతడు పొట్ట చీల్చుకుని బయటకు వస్తాడు. తాను పొందిన విద్యతో శుక్రాచార్యుడికి తిరిగి ప్రాణం పోస్తాడు.

ఎలాగైతేనేం దేవతల ప్రతినిధి కచుడు మృతసంజీవని విద్య నేర్చుకోగలిగాడు. ఈ పరిణామంతో భంగపడిన శుక్రుడు రాక్షసులకు సురాపానం నిషేధిస్తాడు. మద్యపానం వల్ల కలిగే అనర్థమేమిటో పురాణాల్లో ఆనాడే స్పష్టంగా చెప్పారు. శత్రువుకు శత్రువైనవారిని మిత్రులుగా చేసుకునే సంప్రదాయం ఏనాటి నుంచో ఉందని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. ఈ రెండు అంశాలు ప్రస్తుత రాజకీయాల్లో వేళ్లూనుకుపోయాయని చెప్పవచ్చు. తాననుకున్నది సాధించడం ద్వారా బలిచక్రవర్తి, అప్పగించిన పని పూర్తిచేయడం ద్వారా కచుడు మంచి కార్యసాధకులుగా మిగిలిపోయారు.

– చెన్నాప్రగడ శర్మ
9440587567