ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన ట్రైబల్ వెల్ఫేర్ డీడీ..

  • బెల్లంపల్లి ఆశ్రమ పాఠశాల సౌకర్యాల మెరుగుదలకు చర్యలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: “సమస్యల వలయంలో బెల్లంపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల” అనే శీర్షికతో ఆంధ్రప్రభలో ప్రచురితమైన కథనానికి ట్రైబల్ వెల్ఫేర్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి స్పందించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి, సౌకర్యాల మెరుగుదలకు తక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.

ఆంధ్రప్రభతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె, పాఠశాలలో అడ్మిషన్లకు ఎలాంటి కొరత లేదని, విద్యార్థుల సంఖ్య 210కు చేరుకునే వరకు ప్రవేశాలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

నూతన పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన భూమి మంజూరు పత్రాల విషయంలో తహసీల్దార్‌తో చర్చించి, ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ఐటీడీఏ సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు.