గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు

  • పేదల పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వం
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైదన వెంకట్

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ:
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట రూరల్ మండలం వేలూరు గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల దగ్గరికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైదన వెంకట్ వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, కొత్తగా ‘జీ రామ్ జీ’ చట్టాన్ని జూలై మాసం నుండి అమలు చేయనుందని ఆరోపించారు. ఈ కొత్త చట్టం వల్ల రాబోయే రోజుల్లో ఉపాధి కూలీలు పని డిమాండ్ చేసే హక్కును కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా 40 శాతం నిధులు ఖర్చు పెట్టవలసి ఉంటుందని, ఎక్కడ పనులు చేయాలో కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు. డబ్బులు రాష్ట్రానివి, పెత్తనం మోడీదన్నట్లుగా ఈ విధానం ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ ‘జీ రామ్ జీ’ చట్టాన్ని వ్యతిరేకించాలని, ఈ చట్టాన్ని తాము అమలు చేయలేమని, దీనివల్ల రాష్ట్రంపై పెను భారం పడుతుందని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఉపాధి కూలీలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

గత 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ చట్టం సాధించిన ప్రగతి తక్కువేమీ కాదని, కరవు సమయాల్లో ఈ పథకం లేకపోతే లక్షలాది మంది ఇబ్బందులు పడేవారని, అంత గొప్ప పథకాన్ని రద్దు చేసి పేదల పొట్ట కొట్టడం తగదని అన్నారు. ఉపాధి హామీ చట్టం వ్యవసాయ ఉత్పత్తిని మెరుగుపరిచి, కుటుంబాల ఆదాయాన్ని పెంచడం ద్వారా గ్రామీణ పేదల జీవన ప్రమాణాలపై సానుకూల ప్రభావం చూపిందని కొనియాడారు. ఈ చట్టం వల్ల గ్రామీణ కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగాయని, కుల అంతరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిరుపేద వ్యవసాయ కార్మికులు భూస్వాములపై ఆధారపడకుండా ఈ పథకం కాపాడిందని గుర్తు చేశారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయించాలని, ఈ నిధులను ఇతర రంగాలకు వాడకూడదని చట్టం స్పష్టంగా చెబుతోందని అన్నారు.

ఉపాధి కూలీలకు పని ప్రాంతాలలో ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు సేద తీరడానికి గుడారాలు ఏర్పాటు చేయాలని, వడదెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద మెడికల్ కిట్లు, తాగునీరు, మజ్జిగ అందించాలని చట్టంలో ఉందని తెలిపారు. అలాగే 100 రోజులు పని పూర్తి చేసుకున్న ప్రతి ఉపాధి కూలీకి గడ్డపారలు, పనిముట్లు ఇవ్వాలని, పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో పండ్ల తోటల పెంపకంతో పాటు దాదాపు 108 రకాల ఇతర పనులను ఉపాధి కూలీల ద్వారానే చేసుకోవచ్చని గ్రామీణ పేదలకు ఉపయోగపడే విధంగా నాటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టం చేసిందని గుర్తు చేశారు. కానీ ఇక్కడి అధికారులు మాత్రం ఈ నిబంధనలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి దాసరి వరహాలు, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి చౌటుపల్లి నాగేశ్వరరావు, చౌటుప్పల్ సుబ్బారావు, వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply