అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం తగదు

అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం తగదు
- నిబంధనల మేరకే పోర్టు రోడ్డులో డ్రైన్ వర్షన్ పనులు
- సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అధికారుల వివరణ
- జాయింట్ ప్రెస్ మీట్ పెట్టిన పబ్లిక్ హెల్త్, ఆర్&బీ, డ్రైనేజీ అధికారులు
- ఎస్టీపీలకు మురుగు నీటిని అనుసంధానించడానికే కల్వర్టు పనులు – పబ్లిక్ హెల్త్ ఈఈ
- పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం – ఆర్&బీ ఈఈ
- కల్వర్టు పనుల వల్ల డ్రైన్ లెవల్స్ కు ఇబ్బంది ఉండదు – డ్రైనేజీ డీఈ
మచిలీపట్నం – ఆంధ్రప్రభ
మచిలీపట్నం ముంపు నీటి సమస్య పరిష్కారానికి గాను స్థానిక బందరుకోట రోడ్డులో చేపట్టిన డ్రైన్ డైవర్షన్ పనులపై వివిధ ప్రసార మాధ్యమాలలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సంబంధిత శాఖల అధికారులు తీవ్రంగా ఖండించారు. నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. మచిలీపట్నం నగరంలోని ఆర్&బీ ఈఈ కార్యాలయంలో ఆర్&బీ, పబ్లిక్ హెల్త్, డ్రైనేజీ, మున్సిపల్ అధికారులు ఉమ్మడిగా మీడియా సమావేశం మంగళవారం నిర్వహించి వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేశారు. పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రవీణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మచిలీపట్నం వచ్చిన సమయంలో నగరంలో డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఈ మేరకు రూ.197.3 కోట్లతో ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి నివేదించగా ఇటీవల రూ.13.02 కోట్లు నిధులు మంజూరైనట్టు తెలిపారు. ఈ నిధులతో గత ప్రభుత్వంలో అనుసంధానించకుండా అసంపూర్తిగా వదిలేసిన డ్రైన్ ల పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నగరంలో గుర్తించిన 122 చోట్ల గ్యాప్ లను రూ.13కోట్లతో పూర్తి చేసేందుకు రూ టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశామన్నారు.
త్వరలోనే పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. అమృత్ 2.0లో నగరంలో రెండు మురుగు నీటి శుద్ధి ఫ్లాంట్ (ఎస్టీపీ)లు నగరానికి మంజూరు అయ్యాయని తెలిపారు. వాటిని నిర్మించేందుకు కరగ్రహారం వద్ద స్థల కేటాయింపులు జరిగాయన్నారు. సబ్ జైల్ అవుట్ ఫాల్ డ్రైన్, ఫత్తుల్లాబాద్ అవుట్ పాల్ డ్రైన్ల నుంచి మురుగు నీటిని పంపింగ్ చేసి ఎస్టీపీల వరకు మళ్లించడం జరుగుతుందన్నారు. దీని వల్ల నగరంలో డ్రైనేజీ సమస్యకు కూడా పూర్తి స్థాయిలో పరిష్కార మార్గం ఏర్పడగలదన్నారు. ఆర్&బీ ఈఈ లోకేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు రోడ్డులో రైల్వే గేటు దాటిన తర్వాత తమ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన కల్వర్టు నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నాణ్యతా ప్రమాణాలు లేకుండా పనులు జరుగుతున్నాయని ఇటీవల ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిథులు తనను కలవడం జరిగిందన్నారు. అయితే డివిజన్ స్థాయిలో జరుగుతున్న పనులు కాబట్టి తమ శాఖ డీఈ, ఎఈలతో మాట్లాడి తెలియజేస్తామని వారికి తెలిపానన్నారు. అనుమతులు లేకుండా పనులు చేపడుతున్నట్టు తాను చెప్పినట్టు వీడియోలను ఎడిట్ చేసి వివిధ మాధ్యమాల్లో ప్రసారం చేయడం సరైన విధానం కాదన్నారు. ఇది కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడమే అని అన్నారు.
కల్వర్టు నిర్మాణ పనులను తాను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతోపాటు సంబంధిత అధికారులతో సమీక్షించామన్నారు. నగర ముంపు సమస్య పరిష్కారానికి గాను అత్యవసర పనిగా ఈ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పనులపై తమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని అనుభవం కలిగిన రిజిస్టర్డ్ కాంట్రాక్టరే ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపడుతున్నారన్నారు. అత్యవసర పనులు ప్రభుత్వం నుండి అనుమతులు రాకముందే చేపట్టే అవకాశం ఉందన్నారు. దానిలో భాగంగానే కల్వర్టు నిర్మాణ పనులతోపాటు మరో పది రకాల పనుల అనుమతులకు 2025 జులై నెలలో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అయితే ఆ పనులకు అనుమతులు రాకపోవటంతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు ఆ ప్రాంత రైతుల అవసరాన్ని పరిగణలోకి చేసుకుని మళ్లీ 2026 మార్చిలో ప్రత్యేకంగా కల్వర్టు నిర్మాణ పనుల అనుమతులకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు.
పనులకు అనుమతులు తీసుకువచ్చే విషయమై మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం నుండి అనుమతులు వస్తాయన్నారు. డ్రైనేజీ ఈఈ కిరణ్ బాబు మాట్లాడుతూ బందరుకోట రోడ్డు వెంబడి వెళుతున్న నార్త్ సైడ్, సౌత్ సైడ్ డ్రైన్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఒకే విధంగా రెండింటి బెడ్ లెవల్స్ ఉండటం వల్ల పరిసర ప్రాంతాలకు ఎటువంటి ముంపు సమస్య ఉత్పన్నం కాదన్నారు. ఈ పనులను తాము ఎప్పటికప్పుడు క్షేత్ర పరిశీలన చేస్తున్నామన్నారు. కల్వర్టు నిర్మాణం ద్వారా వర్షాకాలంలో నగరంలో నిలిచే ముంపు నీరంతా ఈ కల్వర్టు గుండా డైవర్ట్ అయి మెడికల్ కాలేజ్ వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలోకి కలుస్తుందన్నారు. దీనివల్ల నగరంలో ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఆర్&బీ డీఈ సంగీత, మున్సిపల్ డీఈ వెంకటేశ్వరరావు, డ్రైనేజీ జేఈ నజీమా రాణి పాల్గొన్నారు.
