ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం

ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం
- కృష్ణా జిల్లాలో ఎనిమిది మంది అరెస్ట్
ఉయ్యూరు, ఆంధ్రప్రభ: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌ల వలలో చిక్కి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. బెట్టింగ్ కార్యకలాపాల వల్ల అనేక మంది అప్పుల బారిన పడి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. దీనివల్ల వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులు, పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
ఉయ్యూరులో పోలీసుల మెరుపు దాడులు..
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం గన్నవరం ఇంచార్జ్ డిఎస్పి పాల శ్రీనివాసరావు నేతృత్వంలో ఉయ్యూరు సీఐ టీ.వీ.వీ రామారావు బృందం పట్టణంలోని పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారులో కూరాడ రాంబాబు (35), కొండపాటి జగదీష్ (23), సత్తివాడ సంపంత్ కుమార్ (29), భూరెల రవి కుమార్ (33), వడ్డిపల్లి సురేష్ బాబు (43), కుమరాపు వినయ్ కుమార్ (23), రొండ పేర్రెడ్డి (57), గుండపు వేణు (30) ఉన్నారు
12 మందిపై కేసులు.. పరారీలో మరో నలుగురు
పోలీసులు నిందితుల నుండి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేయగా, ప్రస్తుతం పరారీలో ఉన్న మారదని ప్రసాద్, బతుల నాగ దుర్గా ప్రసాద్, కొండపల్లి హరి, పండ్రాజు సత్యనారాయణల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల బ్యాంక్ లావాదేవీలు, సాంకేతిక సమాచారం ఆధారంగా ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
