కొక్కిలిగడ్డ పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభం

కొక్కిలిగడ్డ పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభం

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి లోకేష్

మోపిదేవి, ఆంధ్రప్రభ: కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో దాతల సహకారంతో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన అదనపు తరగతి గదులను రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించిన మంత్రి విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల ప్రాంగణంలో మంత్రి లోకేష్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

తొలిసారిగా కొక్కిలిగడ్డ గ్రామానికి మంత్రి నారా లోకేష్ రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, దాతలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.