లాకప్ డెత్?.. లేక ఆత్మహత్య?..
లాకప్ డెత్?.. లేక ఆత్మహత్య?..
కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో ఓ వ్యక్తి ఆత్మహత్య?..
కొలిమిగుండ్ల నంద్యాల జిల్లా, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని కొలిమిగుండ్ల మండలంలోని బెలుం శింగవరం గ్రామానికి చెందిన దొమ్మర వెంకటసుబ్బయ్య (38) అనే నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ లోని బాత్రూంలో తాను కట్టుకున్న పంచతోనే ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు.గత మూడు రోజుల కిందట బెలుం శింగవరం గ్రామంలో జరిగిన ట్రాక్టర్ దొంగతనానికి సంబంధించిన కేసులో సదరు నిందితుడిని అతనితోపాటు ఈ దొంగతనానికి పాల్పడిన తేజ అనే వ్యక్తిని కూడా శనివారం సాయంత్రం కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చారు.
సదరు నిందితుడు దొంగతనం చేసిన ట్రాక్టర్ ను కూడా పోలీసులు నిన్నటి దినమైన శనివారము సాయంత్రమే కర్నూల్ లో గుర్తించి స్వాధీనపరచుకోవడం కూడా జరిగిందని తెలిపారు . శనివారం రాత్రి తన సహ నిందితుడితో కలిసి నిద్రిస్తున్న వెంకటసుబ్బయ్య తెల్లవారుజామున తాను బహిర్భూమికి వెళ్లాలంటూ స్టేషన్లోనే ఉన్న బాత్రూంకు వెళ్లి, తాను కట్టుకున్న పంచతోనే ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు.చాలాసేపటి వరకు సదరు మృతుడు బయటికి రాకపోవడంతో గుర్తించిన పోలీసులు సహ నిందితుడిని విచారించగా అతను రాలేదని చెప్పడంతో బలవంతంగా బాత్రూం డోర్లు పగల కొట్టి చూడగా ఉరి వేసుకుని ఉండడానికి గమనించామన్నారు. వైద్య చికిత్స నిమిత్తము అవుకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యాధికారులు తెలియచేశారన్నారు.
ఈ సమాచారం బయటికి రావడంతో ముందుగా లాకప్ డెత్ అని పలువురు భావించారని, అది నిజం కాదని పోలీస్ అధికారులు అన్నారు.ఈ విషయంపైనే మృతుని భార్య లక్ష్మి తన భర్త మృతి విషయంపై విచారణ చేయాలంటూఇచ్చిన ఫిర్యాదును కూడా నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించటంతో నంద్యాల ఎ ఎస్ పి మంద జావళి ,,డోన్ డిఎస్పి శ్రీనివాసులతో కలిసి కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేశారు. స్థానిక సీఐ రమేష్ బాబు తో కేసు పూర్వపరాలు అడిగి తెలుసుకున్నారు. సదరు నిందితుడు పైన గతంలో ఇదే స్టేషన్లోనే మూడు కేసులు నమోదయి ఉన్నాయని ,, తాజాగా ఈ దొంగతనం కేసులో కూడా అతను నిందితుడని పోలీసు అధికారులు తెలిపారు. ఇతనితోపాటు ఈ దొంగతనానికి పాల్పడిన నిందితుడు తెలంగాణ రాష్ట్రం, గద్వాల్ జిల్లా, ఉండవల్లి మండలం, పరగటూరు గ్రామానికి చెందిన దొమ్మరి తేజ ప్రస్తుతము పోలీస్ అదుపులోనే ఉన్నాడు. మరొక నిందితుడు నరేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహానికి అవుకు ప్రభుత్వ వైద్యశాల యందు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
