ఇంధన ధరలు తగ్గించాలంటూ పత్తికొండలో వైసీపీ నిరసన

ఇంధన ధరలు తగ్గించాలంటూ పత్తికొండలో వైసీపీ నిరసన

పత్తికొండ, ఆంధ్రప్రభ : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని నాలుగు స్తంభాల కూడలి వద్ద గాంధీ విగ్రహం సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ప్రజలపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వం వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.