కర్నూలులో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన విజిబుల్ పోలీసింగ్..

కర్నూలులో రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన విజిబుల్ పోలీసింగ్..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు పట్టణంలో రాత్రి వేళల్లో నేరాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి నాలుగవ పట్టణ సిఐ విక్రమ సింహ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు నుంచి బళ్లారి చౌరస్తా వరకు, అలాగే పట్టణంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

మొత్తం 14 బ్లూ కోల్ట్స్ బృందాలు, 4 క్యూఆర్టీ బృందాలు పాల్గొని అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను పరిశీలించాయి. రాత్రి 11 గంటల తర్వాత షాపులను మూసివేయిస్తూ, అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రావద్దని పోలీసులు సూచించారు. అనవసరంగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించినా లేదా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 లేదా 100కు సమాచారం అందించాలని సూచించారు.

