పాఠశాలల్లో 100 శాతం విద్యార్థుల నమోదు పూర్తి చేయాలి

పాఠశాలల్లో 100 శాతం విద్యార్థుల నమోదు పూర్తి చేయాలి
ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను సకాలంలో పూర్తి చేయాలని సూచన
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని 29 మండలాల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను యాప్‌లో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానంద రాజ్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రెడ్డి సూచించారు.
మంగళవారం స్థానిక కార్యాలయ సమావేశ భవనంలో ఐఈఆర్పీలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో మే 5 నుంచి జూన్ 10 వరకు నిర్వహిస్తున్న ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో ప్రతి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థి తప్పనిసరిగా నమోదు కావాలన్నారు.
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయడం ఒక గొప్ప బాధ్యత అని పేర్కొంటూ, వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారి భవిష్యత్తు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు.
అలాగే భవిత కేంద్రాల్లో అన్ని రికార్డులను సమర్థవంతంగా నిర్వహించాలని, విద్యార్థులకు అందాల్సిన ఉపకరణాలు, ఉపకారవేతనాలు ఎవరూ మిగలకుండా అందేలా చూడాలని తెలిపారు.
ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష కార్యక్రమం కింద ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహణకు ఎంపికైన 21 మంది విద్యార్థుల్లో జిల్లాకు చెందిన 7 మంది ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ఐఈఆర్పీలను అభినందించారు.
జిల్లా ఐఈ సమన్వయకర్త జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు జరిగిన ఎన్రోల్మెంట్ పురోగతిపై మండలాల వారీగా వివరించారు. సర్వే సమయంలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
అధికారుల సూచనల మేరకు ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు వారి విద్యాభివృద్ధికి ఐఈఆర్పీలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంఓ మాధవి, జిల్లా ఐఈ సహాయ సమన్వయకర్త శ్రీనివాసులు, ఆయా మండలాల ఐఈఆర్పీలు పాల్గొన్నారు.
