తిరుమలయపాలెంలో భద్రతా సంక్షోభం

తిరుమలయపాలెంలో భద్రతా సంక్షోభం

  • వరుస దొంగతనాలతో ప్రజల్లో భయం

పాలేరు నియోజకవర్గం, ఆంధ్రప్రభ : పాలేరు నియోజకవర్గంలోని తిరుమలయపాలెం మండలంలో భద్రతా పరిస్థితులు రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతున్నాయి. “రోజుకో దొంగతనం – ఊరుకో దొంగతనం” అన్నట్టుగా మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా దొంగతనాలు చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తోంది.

పిండిప్రోలు గ్రామంలో ఓ ఇంట్లో 8 తులాల బంగారం సహా విలువైన సామాన్లు దొంగిలించబడగా, దమ్మాయిగూడెం గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న కిరాణా దుకాణంలో ఒక నెలలో రెండుసార్లు దొంగతనం జరిగింది. ఈ తరహా ఘటనలు వరుసగా జరుగుతుండటంతో నిఘా వ్యవస్థ స్తబ్దుగా మారిందా? పోలీసుల పర్యవేక్షణ తగ్గిందా? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల గ్రామాల్లో గంజాయి వినియోగం పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మత్తు ప్రభావంతో యువతలో నేర ప్రవర్తన పెరుగుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తూ అవకాశమొస్తే దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొలాల్లో ఉన్న బావుల వద్ద మోటార్లు, కాలువల వద్ద అమర్చిన ఎలక్ట్రిక్ పరికరాలు దొంగిలించబడుతున్నాయి. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని వైర్లను కూడా దొంగిలించే ఘటనలు పెరిగిపోయాయి. దీంతో రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు.

ఇళ్లలోకి చొరబడి బంగారం, నగదు అపహరించే ఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి. రాత్రి సమయంలో కుటుంబాలు నిద్రలో ఉండగా దొంగలు సునాయాసంగా తమ పని పూర్తి చేసి పరారవుతున్నారని బాధితులు వాపోతున్నారు. అలాగే పెట్రోల్ బంకుల వద్ద లేదా రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల బ్యాటరీలు, ఇతర భాగాలు కూడా దొంగల లక్ష్యంగా మారుతున్నాయి.

ఈ ఘటనలపై కేసులు నమోదవుతున్నప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. దొంగలను పట్టుకునే దిశగా గట్టి చర్యలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. “పోలీసులు పర్యటనలు పెంచాలి, రాత్రి పహారా బలపరచాలి, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి” అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మొత్తానికి, తిరుమలయపాలెం మండలంలో భద్రతా పరిస్థితులను మెరుగుపరచడం అత్యవసరం. లేకపోతే ప్రజల ప్రాణాలు, ఆస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంటుందా? లేక దొంగల రాజ్యం కొనసాగుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply