కొండపల్లిలో ఉపేంద్ర దాస్‌కు ఘన స్వాగతం…

కొండపల్లిలో ఉపేంద్ర దాస్‌కు ఘన స్వాగతం…
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గంగోత్రి నుంచి రామేశ్వరం వరకు రోడ్డుపై సాష్టాంగ నమస్కారం చేస్తూ దండయాత్ర చేస్తున్న శ్రీ రాముల వారి భక్తుడు ఉపేంద్ర దాస్ ఆదివారం కొండపల్లి పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థాన సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా ఆయనకు ఘన స్వాగతం పలికారు. లోక కల్యాణం కోసం యాత్ర చేపట్టిన ఉపేంద్ర దాస్‌కు ఆశీస్సులు అందజేస్తూ వారి సంకల్పం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ కఠోరమైన యాత్ర ఎంతో ఆధ్యాత్మికతతో కూడుకున్నదని, దారి పొడవునా భక్తులు, ప్రజలు ఆయనకు అవసరమైన సేవలు అందించాలని అల్తాఫ్ బాబా కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక కోరికను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, భారతదేశంలో అమరావతి రాజధాని నంబర్ వన్ స్థానంలో నిలవాలని ప్రార్థించమని తెలిపారు. ఉపేంద్ర దాస్ మాట్లాడుతూ గంగోత్రి నుంచి రామేశ్వరానికి భూమిపై సాష్టాంగ నమస్కారం చేస్తూ చేస్తున్న ఈ దండయాత్ర ప్రధాన ఉద్దేశం ప్రపంచ శాంతి, లోక కల్యాణమని పేర్కొన్నారు.

భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సహా అన్ని మతాల ప్రజలు సోదర భావంతో ఐకమత్యంతో జీవించాలని, దేశంలో శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు నెలకొనాలని ప్రార్థిస్తూ తన యాత్రను కొనసాగిస్తున్నానని తెలిపారు. స్థానిక భక్తులు, గ్రామస్థులు ఉపేంద్ర దాస్‌కు శుభాకాంక్షలు తెలిపి ఆయన యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
