Hardik pandya | సైకిల్‌పై ప్రయాణం చేసి వచ్చిన అభిమాని
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై చేరుకున్న అభిమాని
ఆప్యాయంగా ముచ్చటించిన హార్దిక్ పాండ్యా
అభిమానికి మరపురాని బహుమతులు ఇచ్చిన స్టార్ క్రికెటర్
రూ.1.5 లక్షల ఆర్థిక సాయం,
ప్రయాణ ఖర్చులు, ప్రత్యేక కానుకలతో అభిమానాన్ని గౌరవించిన టీమిండియా స్టార్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అభిమానులు తమ అభిమాన తారల కోసం ఎంతదూరమైనా వెళ్తారనే మాటను మరోసారి నిజం చేశాడు ఒడిశాకు చెందిన ఓ యువకుడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కలుసుకోవాలనే లక్ష్యంతో ఏకంగా 12 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ ఒడిశా నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. తన కోసం ఇంత కష్టపడి వచ్చిన అభిమానిని చూసిన పాండ్యా కూడా అదే స్థాయిలో స్పందించి అతడిని మరపురాని విధంగా సత్కరించాడు.
ఒడిశా నుంచి వందల కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణించి బెంగళూరుకు చేరుకున్న అభిమానిని హార్దిక్ పాండ్యా ఆప్యాయంగా పలకరించారు. అతనితో కొంతసేపు మాట్లాడి, అతడి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, అభిమానిపై తన అభిమానాన్ని చాటుతూ రూ.1.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే తిరుగు ప్రయాణానికి అయ్యే మొత్తం ఖర్చును కూడా భరించడంతో పాటు, విరాట్ కోహ్లీ బ్రాండ్‌కు చెందిన ప్రత్యేక షూలను కానుకగా బహూకరించారు.
హార్దిక్ పాండ్యా చూపిన ఈ ఆప్యాయతకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అభిమానుల ప్రేమను గౌరవిస్తూ ఆయన వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. “ఇదే నిజమైన క్రీడాస్ఫూర్తి”, “అభిమానాన్ని గౌరవించడం అంటే ఇదే”, “హార్దిక్ నిజమైన జెంటిల్‌మన్” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
