ఆయిల్ ఫామ్ సాగువైపు దృష్టి సారించాలి

  • ఎకరాకు రూ.3 లక్షల వరకు ఆదాయం
  • ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి
  • చిన్న, సన్నకారు రైతులకు అండగా ప్రభుత్వం
  • ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: ప్రతీ రైతు ఆయిల్ ఫామ్ సాగు వైపు దృష్టి సారించి.. స్థిరమైన ఆదాయం పొందే దిశగదా అడుగులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తన 60 సంవత్సరాల జీవితంలో ఈ ప్రాంతం నీటి కోసం పడిన ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశానని, ఎస్ఆర్ఎస్పీ డీ- 83, డీ- 86 కాలువల రాకతో ఈ ప్రాంత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికంగా 1.20 నుంచి 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఉందన్నారు. డీ- 86 కింద 87 వేల ఎకరాలు, డీ- 83 కింద 35 వేల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న దిగుబడులు అధికంగా వస్తున్నాయని, ఈ సీజన్లో 2.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 27 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే చెల్లింపులు అందుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. యూరియా బుకింగ్ యాప్ను తొలిసారిగా పెద్దపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దానిని అమలు చేయగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.

అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూమి సారవంతత తగ్గి భవిష్యత్తులో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రైతులు గుర్తించాలని సూచించారు. రైతులు వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, తెలంగాణ రాష్ట్రం ఆయిల్ష్పామ్ సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం తక్కువ ధరకు మొక్కలు అందజేస్తోందని, నాలుగేళ్ల తర్వాత ఎకరాకు సుమారు రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఆ నాలుగేళ్లలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ ఆయిల్ ఫామ్‌ సాగును విస్తరించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. శివపల్లి గ్రామంలో ఒకేసారి 120 ఎకరాల్లో ఆయిల్ష్పామ్ మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. దీనిని చూసి మరింత మంది రైతులు ఆయిల్ష్పామ్ సాగు వైపు ఆకర్షితులవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోందని, శ్రీరాంపూర్ మండలంలో కొత్త ఆయిల్ష్పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవుతోందన్నారు. ప్రస్తుతం ఆయిల్ ఫామ్‌ ధర టన్నుకు రూ.23 వేల వరకు పెరగడంతో రైతులకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉందని తెలిపారు.