‘బడి పిలుస్తుంది’తో ఇంటింటికీ విద్యా చైతన్యం..

‘బడి పిలుస్తుంది’తో ఇంటింటికీ విద్యా చైతన్యం..
అడ్మిషన్ ఫారాలతో విద్యార్థుల ఇళ్లకు చేరిన డీఈవో బృందం..
ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన..
జూన్ 12 నాటికి 100 శాతం నమోదు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు
నందిగామ, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమం నందిగామలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, డివైఈవో గురునాథం, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల బృందం మంగళవారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి విద్యా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ స్వయంగా ఓ విద్యార్థికి అడ్మిషన్ ఫారాన్ని అందజేసి, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు.

మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, విద్యా కానుక, ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. “బడీ ఈడు పిల్లలు ఒక్కరు కూడా విద్యకు దూరం కాకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు ప్రభుత్వ బడులపై విశ్వాసం ఉంచి పిల్లలను చేర్పించాలి” అని డీఈవో చంద్రకళ పిలుపునిచ్చారు.
డివైఈవో గురునాథం మాట్లాడుతూ, జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి రోజే పూర్తి స్థాయి హాజరు నమోదయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెంపుపై విద్యాశాఖ చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది.
