ఓదెల మల్లన్న ఆలయంలో తేనెటీగల దాడి..
20 మంది భక్తులకు గాయాలు
ఓదెల, ఆంధ్రప్రభ: ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) దేవస్థానంలో బుధవారం తేనెటీగలు భక్తులపై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్శనం కోసం వచ్చిన భక్తులపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు విరుచుకుపడటంతో ఆలయ ప్రాంగణం క్షణాల్లోనే భయాందోళనకు గురైంది. భక్తులు ప్రాణభయంతో పరుగులు తీయడంతో ఆలయ పరిసరాలు గందరగోళంగా మారాయి.
కరీంనగర్ నుంచి కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు అక్కడే ఉన్న పలువురిపై తేనెటీగలు ఒకేసారి దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరు నెలల పసికందుతో సహా సుమారు 20 మంది గాయపడినట్లు సమాచారం. చిన్నారిపై కూడా తేనెటీగలు దాడి చేయడంతో అక్కడున్న వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ నరేష్, పైలట్ రాజేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులను కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.
తేనెటీగల దాడికి గల కారణాలపై ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.
