ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.ఆదివారం జనగామ మండలంలోని గానుగుపహాడ్ గ్రామంలో పంచాయతి సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు స్పెషలిస్ట్ వైద్యులచే ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, శిబిరాన్ని నిర్వహిస్తున్న తీరు, అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో గల వార్డు సభ్యులకు, మల్టీ పర్పస్ వర్కర్లకు అన్ని రకాల పరీక్షలను నిర్వహించి, వచ్చే వైద్య నివేదికలకు అనుగుణంగా చికిత్సను అందించాలని సూచించారు. అలాగే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది అందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని, తగిన పరీక్షలు, చికిత్సలను ఉచితంగా పొందాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వారి విధి నిర్వహణలో భాగంగా తరచుగా పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వీరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు, పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.