క్రీడాకారులకు సువర్ణావకాశం

తెలంగాణ క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి (ఎఫ్‌ఏసీ) బి. పవన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో సైక్లింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్, స్విమ్మింగ్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, హాకీ క్రీడాంశాల్లో బాలురు, బాలికలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఎంపికలు జూలై 20 నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.

పలు క్రీడా కేంద్రాల్లో సెలెక్షన్స్
ఎంపిక ప్రక్రియ హైదరాబాద్‌లోని ఓయూ సైక్లింగ్ వెలోడ్రోమ్, సరూర్‌నగర్ స్టేడియం, ఎల్‌బీ స్టేడియం, గచ్చిబౌళి స్పోర్ట్స్ కాంప్లెక్స్, అలాగే ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, హనుమకొండ జేఎన్ స్టేడియం తదితర కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా విభాగాన్ని బట్టి 10 నుంచి 12 సంవత్సరాలు, 14 నుంచి 16 సంవత్సరాలు, 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు ఎంపికలకు అర్హులని తెలిపారు. ధ్రువపత్రాలతో ఉదయం 7 గంటలకు హాజరు కావాలి. ఎంపికల్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు సంబంధిత ధ్రువపత్రాలతో ఎంపిక కేంద్రాలకు హాజరు కావాలని డీవైఎస్‌ఓ పవన్ కుమార్ సూచించారు.

అభ్యర్థులు తమ వెంట ప్రస్తుత విద్యాసంస్థ జారీ చేసిన వయస్సు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, జనన ధ్రువీకరణ పత్రం లేదా ఎస్‌ఎస్‌సీ మెమో, 10 పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, క్రీడా ధ్రువీకరణ పత్రాల ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. ఎంపికల తేదీలు, క్రీడల వారీగా వయోపరిమితి, ఇతర వివరాల కోసం జిల్లా యువజన, క్రీడల కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.