భూసమీకరణ వివరాలు త్వరగా సీఆర్డీఏకు అందించాలి
భూసమీకరణ వివరాలు త్వరగా సీఆర్డీఏకు అందించాలి
జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ ఆదేశం
నరసరావుపేట, ఆంధ్రప్రభ: అమరావతి మండలంలో ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ)కు అంగీకరించిన రైతుల వివరాలతో పాటు దేవాదాయ, రెవెన్యూ శాఖల భూముల రికార్డులను త్వరితగతిన క్రోడీకరించి సీఆర్డీఏకు అందించాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు.
బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీసీ హాల్‌లో ల్యాండ్ పూలింగ్, భూముల వివరాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు సకాలంలో పరిహారం అందించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియలో వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి సులభంగా, వేగంగా జరగాలని ఆమె సూచించారు. సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, అమరావతి మండల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశించారు.
ల్యాండ్ పూలింగ్ పరిధిలో ఉన్న దేవాదాయ భూములు, రిజిస్టర్ అయిన భూములు, రిజిస్టర్ కాని భూములు, జరీబ్ భూములు, చెరువులు, కాలవ పోరంబోకు తదితర భూములను క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని చెప్పారు. సర్వే అనంతరం స్పష్టమైన నివేదికను సిద్ధం చేసి సీఆర్డీఏకు అందించాలని అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సత్తెనపల్లి ఆర్డీవో శ్రీరాములు, సీఆర్డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమణాకాంత్ రెడ్డి, అమరావతి తహశీల్దార్ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
