ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు కీలక అవగాహన..!

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు కీలక అవగాహన..!

లాభాల దిశగా కొత్త మార్గం

శావల్యాపురం, ఆంధ్ర‌ప్రభ : పల్నాడు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఐ. వెంకట్రావ్ ఆధ్వర్యంలో గోద్రెజ్ ఆగ్రో విట్ సంస్థ సహకారంతో మండలంలోని కారుమంచి గ్రామంలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోద్రెజ్ ఆగ్రో విట్ అసిస్టెంట్ మేనేజర్ శ్యాంసుందర్ పాల్గొని మాట్లాడారు. ఆయిల్ ఫామ్ మొక్కలను ఉద్యాన శాఖ ద్వారా 100 శాతం రాయితీపై రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మొక్కల నిర్వహణ, ఎరువుల వాడకం, సస్యరక్షణ పద్ధతులపై వివరాలు అందించారు. పంట కోత అనంతరం గోద్రెజ్ ఆగ్రో విట్ కంపెనీ కొనుగోలు చేస్తుందని, దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ నిర్ణీత ధరలతోనే కొనుగోళ్లు జరుగుతాయని పేర్కొన్నారు.

ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే రైతులకు కంపెనీ తరఫున కొనుగోలు ఒప్పంద పత్రాలు అందజేస్తామని తెలిపారు.

జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకట్రావ్ మాట్లాడుతూ ఎకరానికి చతురస్రాకార పద్ధతిలో 50 మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల పెంపకం, నిర్వహణ, అంతర పంటలకు కూడా రాయితీలు అందిస్తున్నట్లు వివరించారు.

ఆయిల్ పామ్ మొక్కలు కావలసిన రైతులు జూనియర్ అధికారి ఐ. జగదీష్‌ను 8074028422 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వినుకొండ ఉద్యాన అధికారి షేక్ నబి రసూల్, మండల వ్యవసాయ అధికారి రామినేని రామారావు, గ్రామ ఉద్యాన సహాయకుడు జంపాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



Leave a Reply