YOUNG MAN | 23 వంగడాలతో యువకుడి సాగు..

YOUNG MAN | 23 వంగడాలతో యువకుడి సాగు..
సేంద్రియ పద్ధతి సాగు.. ఆరోగ్య ప్రదాయం
YOUNG MAN | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని వీర్లపల్లి బావికి చెందిన యువ రైతు బిల్లపాటి గోవర్ధన్ రెడ్డి(Billapati Govardhan Reddy) తన 20గుంటల్లో 23రకాల వంగడాలతో ధాన్యాన్ని సాగు చేసి, బహు రూప బియ్యం, ఆరోగ్య ప్రదాయం అంటూ, సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ ఆ యువరైతు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో సంచరించి తనకున్న 20గుంటల పొలంలో ఒక్కో గుంటలో ఒక్కోరకం చొప్పున 23రకాలైన కాలా నమ్మక్, కాలాబట్టి, కృష్ణ వ్రీహీ, నారాయణ, కామిని, బహు రూపి, తులంబంజి, సీరగసాంబ, ఇంద్రాణి, పొక్కురు, మా పల్లె సాంబ, ఇల్లపు సాంబ, మట్ట రైస్, తూయపల్లి, కాలాజీరా, వూoగార్, చిట్టి ముత్యాలు, మణిపురి బ్లాక్, చికిల కోయిల, డాక్టర్ రైస్ (D.r Rice) రాజముడి , కర్చు కవని, గరుడన్ సాంబ, కరుంగ్ కురువై లాంటి రకాల ధాన్యాన్ని పండిస్తూ వారి కుటుంబం అంతా ఇదే బియ్యం తింటుండడంతో తాము ఆరోగ్యంగా ఉంటున్నట్లు వివరించారు.

ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మన పూర్వీకుల మాదిరిగా మనం సైతం పాత వరి వంగడాలను సేద్యం చేయాలన్నారు. కూరగాయలు సైతం తాను సేంద్రియ పద్ధతిలో పండించిన వాటినే వినియోగిస్తున్నట్లు తెలిపారు. నేటి రోజుల్లో చిన్న వయసులోనే బి పి, షుగర్, గుండె పోటు తదితర సమస్యలు వస్తున్నాయని వీటి నివారణకు రసాయన రహిత పంటలే ఉత్తమమన్నారు. ఈ యువకుడు (Young Man) సాగు చేస్తున్న పంటలను పరిశీలించడానికి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి పి. వెంకటరమణారెడ్డితో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సైతం క్షేత్రస్థాయిలో సందర్శించి పంటల సాగు, ప్రాముఖ్యత ను తెలుసుకున్నారు. ఆ యువ, సేంద్రియ రైతు గోవర్ధన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని రైతులు తమ ఇంటి అవసరాలకు ఆయా వంగడాలను సాగు చేయాలని అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
