బొగ్గు పరిశ్రమకు విఘాతంకలగకుండా పరిరక్షణకై ఉద్యమం..
బొగ్గు పరిశ్రమకు విఘాతంకలగకుండా పరిరక్షణకై ఉద్యమం..
- ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అయితే బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా సంస్థ పరిరక్షణకు వ్యూహాత్మక ఉద్యమాలు చేపడతామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి, గుర్తింపు సంఘం నాయకుడు కొరిమి రాజ్‌కుమార్ తెలిపారు.
బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కంపెనీలో మెడికల్ బోర్డు వ్యవస్థను నిర్లక్ష్యం లేకుండా కొనసాగించాలని, సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల వారసుల సమస్యను పరిష్కరించడంతో పాటు కార్మికుల సొంతింటి కలను సాకారం చేయాలని కోరారు.
డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పించాలని, సాధారణ మరణం చెందిన సింగరేణి కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సహా మొత్తం 31 డిమాండ్లతో ఈ నెల 8న సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
సింగరేణి పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ జోక్యం పెరిగిందని విమర్శించిన రాజ్‌కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణి బొగ్గు పరిశ్రమకు కొత్త ప్రాజెక్టులను తీసుకురావాలని సూచించారు.
గని కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కార్మికుల హక్కుల పరిరక్షణలో ఏఐటీయూసీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. సమ్మె నోటీసుపై ఇతర కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కొనసాగితే ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమై అవసరమైతే సమ్మె బాట పడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డీ ఎల్లయ్య గౌడ్, వై.వి. రావు, జాతీయ కమిటీ నాయకుడు కవ్వంపల్లి స్వామి, నాయకులు జూపాక రాంచందర్, రంగు శ్రీను, గంధం సాంబశివరావు, గండి ప్రసాద్, అటికేటి రాజు, రంజిత్, చేరాలు, రామస్వామి, సమ్మయ్య, నల్ల మహేష్, జీవన్, కార్యాలయ కార్యదర్శి తొడుపునూరి రమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
