శోభాయమానంగా పద్మావతి అమ్మవారి పుష్పయాగం

తిరుచానూరు, ఆంధ్రప్రభ : నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం భక్తులను ఆకట్టుకుంది.

ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం దాతలు సమర్పించిన 4 టన్నుల పుష్పాలతో పుష్పయాగం చేపట్టారు. తమిళనాడు నుంచి రెండు టన్నులు, కర్ణాటక నుంచి ఒక టన్ను, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టన్ను పూలు అందించబడినట్టు టిటిడి తెలిపింది.

మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్థాన మండపం నుంచి పుష్పాలు, పత్రాలను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువచ్చి, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు శ్రీ కృష్ణముఖ మండపంలో పుష్పయాగం కన్నుల పండుగగా కొనసాగింది. చామంతి, సంపంగి, మల్లె, రోజా తదితర 14 రకాల పుష్పాలు, తులసి, బిల్వం వంటి 6 రకాల పత్రాలతో అమ్మవారికి పుష్పాంజలి సమర్పించారు.

బ్రహ్మోత్సవాల్లో లేదా నిత్యకైంకర్యాల్లో జరిగిన శుద్ధి లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమంలో డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈవో దేవరాజులు, ఇతర అధికారులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply