Kc-Canal-Crisis :2.65 లక్షల ఎకరాలకు ముప్పుAndhra Prabha Spl Story

Kc-Canal-Crisis :2.65 లక్షల ఎకరాలకు ముప్పుAndhra Prabha Spl Story

  • ఎక్కడికక్కడ కేసీ కాల్వ థ్వంసం
  • 304 కి.మీల‌లో ప్రమాద ఘంటికలు.
  • ఐదేళ్ల నిర్వహణ లోపం
  • చాగలమర్రి వరకు శిథిలావస్థ…
  • ఎల్‌నినో ప్రభావంతో రైతుకు రెండింతల కష్టాలు

( కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ)

రాయలసీమ రైతుకు జీవనాడిగా పేరొందిన కర్నూలు–కడప (కేసీ) కాల్వ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. సుంకేసుల జలాశయం నుంచి వైఎస్సార్ జిల్లా కృష్ణాపురం వరకు 304 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కాల్వ ఐదేళ్లుగా సరైన నిర్వహణకు నోచుకోకపోవడంతో ఎక్కడికక్కడ కట్టలు కుంగిపోవడం, లైనింగ్ దెబ్బతినడం, గోడలు కూలిపోవడం, కాల్వ అడుగుభాగంలో మట్టి పేరుకుపోవడం వంటి సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. ఇటీవల నందికొట్కూరు మండలం శాతనకోట వద్ద కాల్వ గోడ కూలిపోవడంతో మొత్తం కేసీ కాల్వ పరిస్థితి మరోసారి చర్చనీయాంశమైంది. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో ఈ ఖరీఫ్‌లో సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టకుంటే 2,65,628 ఎకరాల ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

Kc-Canal-Crisis : కాల్వ పొడవునా శిథిలావస్థ

కేసీ కాల్వ సుంకేసుల బ్యారేజీ వద్ద ప్రారంభమై కర్నూలు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి మీదుగా వైఎస్సార్ జిల్లా కృష్ణాపురం వరకు విస్తరించింది. తొలి 40 కిలోమీటర్ల పరిధిలోనే కట్టలు నెర్రలు బారాయి. లైనింగ్ పూర్తిగా కుంగిపోయింది. స్లూయిజ్‌లు, షట్టర్లు దెబ్బతిన్నాయి. కాల్వ అడుగుభాగంలో మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గిపోయింది.

అల్లూరు, శాతనకోట, పగిడ్యాల, జూపాడుబంగ్లా ప్రాంతాల్లో లైనింగ్ అనేక చోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. 60 కిలోమీటర్ల తర్వాత మల్యాల నుంచి ముచ్చుమర్రి వరకు కాల్వ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ప్రధాన కాల్వలో పగుళ్లు ఏర్పడటంతో పాటు పలుచోట్ల భారీగా కుంగిపోయింది. కాల్వకు ఇరువైపులా ముళ్లపొదలు పెరిగి, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో సాగునీటి కాల్వ మురుగుకాల్వను తలపిస్తోంది.

వెలుగోడు, గడివేముల, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి ప్రాంతాల్లో కూడా కాల్వ లైనింగ్ దెబ్బతినడంతో నీటి లీకేజీలు అధికమయ్యాయి. గొట్లూరు, మల్లేవేముల సమీపంలో కాల్వ గండ్లు పడగా, చాగలమర్రి పరిధిలో పంట కాల్వలు ఆనవాళ్లు కోల్పోయిన పరిస్థితి నెలకొంది.

Kc-Canal-Crisis : శాతనకోటలో నిర్లక్ష్యం

నందికొట్కూరు మండలం శాతనకోట సమీపంలో 72వ గేటు వద్ద ఇటీవల కాల్వ గోడ కూలిపోవడం కేసీ కాల్వ దుస్థితికి నిదర్శనంగా మారింది. కాల్వ కట్ట బలహీనపడిందని రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా మరమ్మతులు చేపట్టలేదు. ఇటీవల కురిసిన స్వల్ప వర్షానికే గోడ కూలిపోవడంతో త్వరలో సుంకేసుల నుంచి నీటిని విడుదల చేస్తే మొత్తం కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి దిగువన ఉన్న సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Kc-Canal-Crisis : విడుదల 2,100 క్యూసెక్కులే

కేసీ ప్రధాన కాల్వను 3,850 క్యూసెక్కుల నీటిని మోయగల సామర్థ్యంతో నిర్మించారు. అయితే ప్రస్తుతం కాల్వ కట్టలు బలహీనపడటంతో అంతమేర నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. భద్రతా కారణాలతో 2,100 క్యూసెక్కులకు మించి నీటిని వదలడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల పథకాల ద్వారా అదనంగా నీటిని పంపించాల్సి వస్తోంది. ఇందుకోసం ప్రతిరోజూ లక్షల రూపాయల విద్యుత్ ఖర్చు అవుతోంది.

Kc-Canal-Crisis : ఎల్‌నినోతో మరింత సంక్షోభం

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కర్నూలు జిల్లాలో సాధారణ వర్షాలు నమోదు కాలేదు. వర్షాభావం కారణంగా రైతులు వరి, పత్తి, మిర్చి, వేరుశనగ, కంది పంటల సాగును వాయిదా వేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి కేసీ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు, పత్తి, మిర్చి సాగు జోరుగా సాగగా, ఈసారి చాలా ప్రాంతాల్లో పొలాలు ఇంకా బీళ్లుగానే కనిపిస్తున్నాయి. తుంగభద్ర నుంచి ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, కాల్వ దుస్థితి రైతుల్లో ఆందోళనను మరింత పెంచుతోంది.

Kc-Canal-Crisis : నిధుల కొరత

2009 వరదల్లో కేసీ కాల్వకు తీవ్ర నష్టం వాటిల్లిన తర్వాత శాశ్వత మరమ్మతులకు రూ.124 కోట్ల అవసరమని అధికారులు ప్రతిపాదించారు. అనంతరం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో రూ.514.40 కోట్లతో ఆధునికీకరణ ప్రణాళిక రూపొందించారు. సుంకేసుల జలాశయం అభివృద్ధి, కాల్వ లైనింగ్ పునర్నిర్మాణం, గట్ల బలోపేతం, రెగ్యులేటర్ల మరమ్మతులు, రక్షణ గోడల నిర్మాణం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ రాష్ట్ర వాటా విడుదల కాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఫలితంగా కాల్వ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇక గతంలో కాలువ దెబ్బతిన్న చోట్ల.. తాత్కాలిక మరమత్తు పనులు చేపట్టింది కూడా రూ.20 కోట్లు తో ప్రతిపాదన పంపినా వాటికి కూడా మోక్షం లభించలేదు.

Kc-Canal-Crisis : ఏటా రూ.168 కోట్ల నష్టం

కేసీ కాల్వ కింద మొత్తం 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏడాది 31.90 టీఎంసీల నీటిని ఖరీఫ్, రబీ పంటలకు అందించాల్సి ఉంది. అయితే కాల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో సుమారు 56 వేల ఎకరాల్లో రెండో పంట సాగు నిలిచిపోయింది. చాగలమర్రి పరిధిలోనే సుమారు రెండు వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఎకరాకు సగటున రూ.30 వేల చొప్పున లెక్కిస్తే రైతులు ప్రతి ఏడాది సుమారు రూ.168 కోట్ల మేర నష్టపోతున్నట్లు అంచనా.

Kc-Canal-Crisis :తక్షణమే చర్యలు చేపట్టాల్సిందే

రాయలసీమ వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిన కేసీ కాల్వను అత్యవసరంగా పునరుద్ధరించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సుంకేసుల నుంచి చాగలమర్రి వరకు అత్యంత ప్రమాదకరంగా మారిన ప్రాంతాల్లో శాశ్వత మరమ్మతులు చేపట్టడం, లైనింగ్ పునర్నిర్మాణం, కట్టల బలోపేతం, మట్టి తొలగింపు, షట్టర్ల మార్పిడి వంటి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరుతున్నారు. లేకపోతే ఈ ఏడాది ఖరీఫ్‌తో పాటు భవిష్యత్‌లో కూడా కేసీ ఆయకట్టు రైతులు తీవ్ర సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి తప్పదని నీటిపారుదల నిపుణులు హెచ్చరిస్తున్నారు.