Crime | కుటుంబ కలహాలే విషాదానికి కారణమా?

Crime | కుటుంబ కలహాలే విషాదానికి కారణమా?

Crime | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్నబిడ్డలకు అండగా నిలవాల్సిన తండ్రే తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి చంపి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. అగ్రహారం గ్రామానికి చెందిన సుధాకర్‌కు, ఆయన భార్యకు మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో సుధాకర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో తన కుమార్తెలైన గోచిత (13), పూజిత (11), లోకిత శ్రీ (8)లకు బలవంతంగా విషం తినిపించిన అనంతరం తానూ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణ ఘటనకు గల పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.