ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్
ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్
- కాంగ్రెస్ నేతల హెచ్చరిక
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు అభివృద్ధి ప్రదాత, అవినీతి మచ్చలేని నాయకుడు, శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై ఆయన ఆశయ సాధనలో సైనికుడిగా పనిచేస్తున్న నియోజకవర్గ నాయకులు పబ్బు రాజు గౌడ్ పై బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా నిరాధార, అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే బీఆర్‌ఎస్ నాయకులు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ కష్టపడి, ఆర్థికంగా బలపడి సొంతంగా ఒక కారు కొనుక్కుంటే కూడా ఓర్వలేకపోతున్నారని, బీఆర్‌ఎస్ నేతల కుటిల బుద్ధిని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
“పచ్చ కామెర్ల వానికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు”… గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి, డబ్బే పరమావధిగా బతికిన వారికి, తాము కష్టపడి సంపాదించుకున్నా అవినీతిలాగే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తామంతా నిక్కచ్చైన, నిజాయితీ గల నాయకుడు రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీలో గానీ, మునుగోడు నియోజకవర్గంలో గానీ అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. తమపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకుల వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా వారు సవాల్ విసిరారు.
పింక్ మీడియా వైఖరిపై ధ్వజం:
బీఆర్‌ఎస్ నాయకులు, వారి అనుకూల ‘పింక్ మీడియా’, పెయిడ్ సోషల్ మీడియా అకౌంట్లు కలిసి ఎన్ని కుట్రలు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా తెలంగాణ సమాజానికి, మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి గుణగణాలు ఏంటో బాగా తెలుసని నాయకులు పేర్కొన్నారు. ఇంకొకసారి ఇలాంటి పెయిడ్ ఛానళ్లు, అకౌంట్ల ద్వారా అసత్య వార్తలను ప్రచారం చేస్తే బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు గట్టిగా హెచ్చరించారు.
ఈ ప్రెస్ మీట్‌లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
