Railways | రూ. 5,754 కోట్ల బడ్జెట్.. 16 ప్లాట్‌ఫామ్‌లతో..

Railways | రూ. 5,754 కోట్ల బడ్జెట్.. 16 ప్లాట్‌ఫామ్‌లతో..
గ్రౌండ్, ఫస్ట్ ప్లోర్ లో రైలు ట్రాక్స్, ప్లాట్ ఫామ్స్
Railways | బెంగళూరు, ఆంధ్రప్రభ : బెంగళూరులో రైల్వే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద రైల్వే టెర్మినల్‌ను యలహంకలో నిర్మించబోతున్నారు. ఈ సరికొత్త టెర్మినల్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఫస్ట్ ఫ్లోర్ (పై అంతస్తు)లో కూడా రైల్వే ట్రాక్‌లు, ప్లాట్‌ఫామ్‌లు ఉండబోతున్నాయి. భారతదేశంలోనే ఇలాంటి టూ-లెవెల్ (రెండు అంతస్తుల) ప్లాట్‌ఫామ్స్ కలిగిన రైల్వే స్టేషన్‌ను నిర్మించడం ఇదే మొదటిసారి. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్నసౌత్ వెస్ట్రన్ రైల్వే గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఉన్నతాధికారులతో ఈ మెగా ప్రాజెక్ట్‌పై కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ప్రాజెక్ట్ వివరాలు అందజేశారు.
భారీ బడ్జెట్‌తో..
బెంగళూరు నగరంలో ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు రెండు లక్షల మంది రైల్వే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఉన్న స్టేషన్లను విస్తరించడానికి స్థల కొరత ప్రధాన సమస్యగా మారడంతో, కొత్త టెర్మినల్ నిర్మించడం ఒక్కటే ఏకైక మార్గమని మంత్రి సోమన్న తెలిపారు. ఈ మెగా టెర్మినల్‌ను దాదాపు రూ. 5,754 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్నారు. రైల్ వీల్ ఫ్యాక్టరీకి సమీపంలో, యలహంక జంక్షన్ నుండి ధర్మవరం వెళ్లే మార్గంలో 7.5 ఎకరాల స్థలంలో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న యలహంక స్టేషన్‌ను కూడా ఇందులో విలీనం చేస్తారు. ఈ సరికొత్త టెర్మినల్‌లో మొత్తం 16 ప్లాట్‌ఫామ్‌లు, 18 పిట్ లైన్లు, 14 స్టేబ్లింగ్ లైన్లను ఏర్పాటు చేయబోతున్నారు. బేస్మెంట్, గ్రౌండ్, ఫస్ట్ , సెకండ్ ఫ్లోర్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల అత్యాధునిక లగ్జరీ వసతులు ఉంటాయి.
ఎయిర్‌పోర్ట్ తరహా డిజైన్
ఈ టెర్మినల్ డిజైన్ అత్యంత స్మార్ట్‌గా ఉండబోతోంది. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు , వెళ్లే ప్రయాణికులు కరికొకరు అడ్డు రాకుండా వేర్వేరు మార్గాలను డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా, ప్రయాణికులు ఎంట్రీ లేదా ఎగ్జిట్ గేట్ల నుండి కేవలం 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేశారు.
12 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు
ప్రస్తుతం బెంగళూరు డివిజన్ రోజుకు 300 రైళ్లను నడుపుతూ, ఏడాదికి 12 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయినా సరే నగరానికి రోజుకు మరో 25-30 రైళ్ల కొరత ఉంది. వచ్చే 2045 నాటికి ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుకుంటుందని, అప్పుడు రోజుకు 500 రైళ్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఆ భవిష్యత్తు అవసరాలను తీర్చడానికే ఈ టూ-లెవెల్ ప్లాట్‌ఫామ్స్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే టెండర్లను మే 22న ఓపెన్ చేయనున్నారు.
