Sensex | లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్‌కు జోష్…
Sensex | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు కనిపించడంతో పాటు, ఇరాన్‌తో చర్చలు జరుపుతామని అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది.
ఉదయం ప్రారంభ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 519 పాయింట్లు ఎగసి 78,613 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 24,557 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.13గా నమోదైంది.
నిఫ్టీ సూచీలో ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బజాజ్ ఫైనాన్స్, టీఎంపీవై షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, సిప్లా, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం నుంచి చర్చలు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 5 శాతం తగ్గి 83.5 డాలర్లకు చేరింది. చమురు ధరల తగ్గుదల దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
