TG | ఆర్యవైశ్య సత్రంకు వేధింపులు..

TG | ఆర్యవైశ్య సత్రంకు వేధింపులు..
- ఆర్యవైశ్య సత్రం కొనసాగాలంటే అడిగినంత ఇవ్వాలని డిమాండ్..
- ఇష్ట దైవాలకు పూజలు చేయకుండా అడ్డుకుంటున్న వైనం..
- సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్న ఆర్యవైశ్యులు..
TG, హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మట్టపల్లి స్వయంభు వెలసిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనువంశిక చైర్మన్ సోదరులు 1951 నుండి అన్నదానం నిర్వహిస్తున్న ఆర్యవైశ్య సత్రంకు సంబంధించిన నిర్వాహకులను వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాశెట్టి వెంకటేశ్వర్లు, గెల్లి విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ హాల్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సత్రంలోని వాసవి అమ్మవారికి పూజలు నిర్వహించాలంటే రూ.10 లక్షలు నగదు ఇవ్వాలని, సత్రం నిర్వహణకు సంబంధించిన ఆర్థిక అంశాలన్నీ తమకు తెలియజేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. ఈ విషయం పై రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులను కలసి విన్నవించగా సత్రాలలో తమ ఇష్టదైవాలకు పూజలు చేసుకోవచ్చని ఆలయ ఈవోకు తెలిపారు.
ఈ విషయాన్ని పాలకమండలి చైర్మన్ కు తెలిపిన నాటి నుండి ఆర్యవైశ్య సత్ర నిర్వాహకులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురి చేస్తు పూజారులను పూజలు చేయనీయకుండా తాము పూజారులను నియమించుకుంటే బూటకపు వ్యక్తులతో లేనిపోని విమర్శలు చేస్తూ ఆర్యవైశ్య సత్ర నిర్వాహకులను మానసిక వేదనకు గురి చేస్తున్నారన్నారు. ఆర్యవైశ్య సత్రం పై చేసిన బూటకపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్న సత్ర నిర్వాహకుల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తామని హెచ్చరించారు. ఆలయ నిర్వహణకు, సత్రాల నిర్వహణలకు సంబంధించిన విషయాల పై సమగ్రంగా విచారణ జరిపి అనువంశిక సోదరుల ఆగడాల పై విచారణ జరిపి, సత్రం నిర్వహణకు సంబంధించిన స్వేచ్ఛను తమకు కల్పించవలసిందిగా అధికారులను కోరుతున్నట్లు తెలిపారు.
భవిష్యత్తులో దైవకార్యాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆలయ అనువంశిక చైర్మన్ చర్యల పై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సత్ర నిర్వాహకులు నాయకులు వెంపటి మధు, కన్నెగుండ్ల రంగయ్య, ఓరుగంటి నరసింహారావు, చల్లా ప్రకాష్ రావు, వంగవీటి వేణు, వెంపటి వెంకటేశ్వర్లు, వెంపటి వెంకటేశ్వర్లు, కుక్కడపు రామ్మోహన్ రావు, పొలిశెట్టి లక్ష్మీ నరసింహారావు, పేరూరి అశోక్ కుమార్, గుండా శ్రీనివాసరావు, ఓరుగంటి మట్టయ్య, పొలిశెట్టి ఎల్లయ్య, కృష్ణమూర్తి, విశ్వనాథం, గెల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
