Dr G.A. Sandeep | ఇది సీమ శౌర్యం..

Dr G.A. Sandeep | ఇది సీమ శౌర్యం..
దేశాన్ని కదిలించిన దర్యాప్తు..
Dr G.A. Sandeep, కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆ ప్రాంతం దేశ సరిహద్దులోని ప్రదేశం .శ్రీనగర్‌లోని (Srinagar) నౌగామ్. సాధారణంగా నిశ్శబ్దంగా కనిపించే వీధులు కానీ.. 2025 అక్టోబరులో అకస్మాత్తుగా కొన్ని గోడల పై పాకిస్థాన్‌కు మద్దతు తెలిపే జైషే మహ్మద్ పోస్టర్లు కనిపించాయి. ప్రాంతీయులకు ఇది కొత్తేమీ కాదు. అక్కడ అప్పుడప్పుడు ఉగ్రవాద గ్రూపులు ఇలాంటివి అంటిస్తూనే ఉంటారు కానీ.. ఒక తెలుగు ఆర్మీ పోలీస్ అధికారికి మాత్రం… ఈ పోస్టర్ చల్లని చెమట పట్టించింది. చిన్న చిన్న పదాల్లో, ఇంకులో దాగిన సందేశాల్లో… అతని ఇంటెలిజెన్స్ కళ్లు ఏదో పెద్ద ప్రమాదాన్ని గుర్తించాయి. ఆ అధికారి పేరే.. డాక్టర్ జి.ఏ. సందీప్ చక్రవర్తి. మంచు కొండల మధ్య ఎన్నో ఏళ్లుగా పని చేసిన శ్రీనగర్ సీనియర్ ఎస్పీ.. ఆయన తెలుగు జాతికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని (Andhra pradesh) కర్నూలు (Kurnool) జిల్లాకు చెందిన ఓ వైద్యుని పుత్రుడు. అతను ఈ పోస్టర్‌ను చూశాడు. ఒక్కసారిగా ఆగాడు. రాత, స్లోగన్, నినాదాలు, పేస్టింగ్ పాయింట్లు, అన్నీ అతని అనుభవ కళ్లకు అనుమానాస్పదంగా అనిపించాయి.
“ఇది సాధారణ పోస్టర్ కాదు… దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉండొచ్చు” అన్న భావనతో వెంటనే దర్యాప్తు ప్రారంభించాడు. తర్వాత జరిగిందేమిటంటే.. భారత భద్రతా వ్యవస్థను కృతజ్ఞతతో ఉప్పొంగేలా చేసే అద్భుత ఆపరేషన్.
- ఒక పోస్టర్… దేశాన్ని రక్షించిన దర్యాప్తు!
సీసీ కెమెరాల జల్లెడా, ఫుటేజీల క్లస్టర్ అనాలిసిస్, రాత శైలి పరీక్షలు, ప్రింటింగ్ మూలాల ట్రాకింగ్.. సందీప్ టీమ్ పని వేగం.. హిమాలయ మంచు గాలిలా చురుకుగా మారింది. ఆ పరిశీలన… తాడి లాగిన చొప్పున… దేశమంతా కుదిపేసే ఉగ్ర నెట్‌వర్క్ బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2,900 కిలోల ఐఈడి తయారీ సామగ్రి లింకులు, ఉగ్ర స్థావరాలు కలిగిన పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలున్న మాడ్యూల్స్, వైట్ కాలర్ టెర్రరిస్టుల నెట్వర్కు, డాక్టర్లు, ఇంజనీర్లు, పరిశోధకులు, అంతే కాదు అంతరాష్ట్ర, అంతర్జాతీయ లింకులు.. ఫరీదాబాద్, సహరాన్‌పూర్ రైడ్లు, ఇది అంతా ఒక పోస్టర్ దర్యాప్తుతోనే. దేశ భద్రతా వ్యవస్థలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇంత పెద్ద కుట్ర ఇలా బయటపడటం అరుదు అని కేంద్ర ఏజెన్సీలు కూడా ప్రశంసించాయి. - వైద్యుడు → యోధుడు..
ఒక అసాధారణ తెలుగోడు జీవనయాత్ర. సందీప్ చక్రవర్తి జీవితం ఒక సినిమా స్క్రిప్ట్‌లా ఉంటుంది. కుటుంబ నేపథ్యం.. కర్నూలు నగరానికి చెందిన ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ జివీ. రామగోపాల్ రావు – రిటైర్డ్ మెడికల్ అధికారి. ఇక తల్లి రంగమ్మ – రిటైర్డ్ ఆరోగ్య అధికారి. మధ్యతరగతి ఇంట్లో క్రమశిక్షణ, సేవాభావం, ఓర్పు, చదువు—ఇవే అతనికి తల్లిదండ్రులు నేర్పిన పాఠాలు.
కే ఎం సి — మెడికల్ కాలేజీ రోజులు
కర్నూలు మెడికల్ కాలేజీలో (Kurnool Medical Collage) ఎంబీబీఎస్ చేసి వైద్యుడయ్యాడు. కానీ అతని హృదయంలో ఇంకో కోరిక “నా సేవలు దేశ రక్షణకీ ఉపయోగపడాలి.” అందుకే వైద్య పుస్తకాల మధ్య… సివిల్స్ పుస్తకాలు కూడా తెరిచాడు. రోజుకు 16 గంటల చదువు. పట్టుదల, లక్ష్యం స్పష్టంగా.. యూపీఎస్సీ 2014 — తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించాడు.
ఇది అరుదైన ఘట్టం.. యువతకు ఆదర్శం..
అక్కడి నుంచి కాశ్మీర్ (Kashmir) లోయల్లో శాంతి కోసం పోరాడే పోలీస్ యోధుడిగా ఎదిగాడు. కాశ్మీర్‌లో ‘చక్రవర్తి’ అంటేనే ధైర్యం. శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా ఇప్పటి వరకు అతని పాత్ర అసాధారణం. అతని పని తీరు ప్రత్యేకతలు. హై రిస్క్ ఆపరేషన్‌లకు స్వయంగా నేతృత్వం వహించారు. టెక్నాలజీ ఆధారిత ఉగ్ర వ్యతిరేక చర్యలు.. ఛేదించడం ఇతని ప్రత్యేకత. ఇంటెలిజెన్స్-గ్రౌండ్ డేటా సమీకరణలో నైపుణ్యం కనబరిచారు. ప్రజలతో హ్యూమన్ పోలీసింగ్ పేరు తెచ్చుకున్నారు. రాడికలైజేషన్ అడ్డుకునే వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. వీటి వల్లే అతను ఇప్పటి వరకు దేశ భక్తిని చాటాయి. ఈ క్రమంలో అతనికి ఇప్పటి వరకు 6 సార్లు రాష్ట్రపతి శౌర్య పతకం, 4 సార్లు జి అండ్ కే గ్యాలెంట్రీ మెడల్ అంటే—దేశంలో అతి తక్కువ కాలంలో ఇన్ని అవార్డులు సాధించిన ఐపీఎస్ అధికారుల్లో మొదటి వరుసలో నిలిచాడు.
తండ్రి రామగోపాల్ రావుకు గర్వకారణం..
“నాకు తెలిసిన నిశ్శబ్దమైన, శాంతమైన బిడ్డ… దేశ భవిష్యత్తును రక్షించే స్థాయికి ఎదుగుతాడని కలలోనైనా ఊహించలేదు. అతను మా ఇంటికి మాత్రమే కాదు, మొత్తం తెలుగు ప్రజలకు గర్వకారణం.”
— డాక్టర్ రామగోపాల్ రావు
తెలుగు యువతకు ప్రేరణ..
సందీప్ కథ ఒక సాధారణ కథ కాదు. అతను చూపించింది అవకాశాలు కోరుకునే వారికి కాదు… తయారయ్యే వారికే వస్తాయి. మెడికల్ స్టూడెంట్ కావచ్చు, ఇంజినీర్ కావచ్చు, రైతు బిడ్డ కావచ్చు… ఇష్టం, పట్టుదల, నిజాయితీ ఉంటే, భారతదేశ భద్రతను కాపాడే స్థాయికి ఎదగొచ్చని ఐపీఎస్ సందీప్ కుమార్ దేశ సేవలో నిరూపించారు.
- కర్నూలు (Kurnool) గర్వపడే రోజు..
ఈ ఆపరేషన్ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే.. కర్నూలంతా ఒక గొప్ప గర్వంతో మార్మోగింది .ప్రజలు, బంధువులు, మిత్రులు, పాత అధ్యాపకులు, హాస్టల్ మేట్స్ ప్రతి ఒక్కరూ ఒక మాటే అంటున్నారు. మన కర్నూలు వాడే… అతనితో దేశం గర్వంగా ఉందంటున్నారు.
తెలుగోడి సత్తా — దేశానికి రక్షణ కవచం..
డాక్టర్ జీఏ సందీప్ చక్రవర్తి కథ— ఒక పోస్టర్ దర్యాప్తు ఎలా దేశాన్ని రక్షించిందో… ఒక తెలుగోడు శౌర్యం ఎలా ఉగ్రవాద గూటిని ఛేదించిందో… వైద్య విజ్ఞానం, పోలీసు శౌర్యం, ఇంటెలిజెన్స్ ప్రతిభ.. మూడింటినీ కలిపిన అసాధారణ ఘటన.
