కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర (Maharashtra), కర్ణాటక (Karnataka) రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన తుంగభద్ర ఆల్మట్టి డ్యామ్(Tungabhadra Almatti Dam)లో నుంచి వరద నీరు శ్రీ‌శైలం జలాశయం (Srisailam Reservoir)లోకి వస్తోంది. శ్రీ‌శైలం జలాశయంలోకి 2,44,017 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. సోమవారం పది రేడియల్ ట్రస్ట్ గేట్ల ద్వారా 10గేట్లు ఎత్తి 2,69,426 క్యూసెక్కుల నీటిని సాగర్ (Sagar) కు విడుదల చేస్తున్నారు. ఇలా ప‌ది గేట్లు ఎత్త‌డం ఈ సీజ‌న్‌లో ఆరోసారి.

జూరాల (Jurala) నుంచి 28 ,825 క్యూసెక్కుల నీరు, స్పీల్ వే నుంచి 1,97,026 క్యూసెక్కుల నీరు వస్తుంది. సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 17916 క్యూసెక్కల నీరు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు చేరుతుంది. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ (Telangana) రాష్ట్రాలు 65, 556 క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైల జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో 883.40 అడుగులు ఉన్నాయి. జలాశయంలో నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో నీటి సామర్థ్యం 206.9734 టీఎంసీలుగా నమోదైంది. విద్యుత్ ఉత్పత్తికి కుడి ఎడమల నుంచి 65,556 క్యూసెక్కుల నీటిని సాగరకు విడుదల చేస్తున్నారు.

ఏపీ జల విద్యుత్ కోసం 30,241 క్యూసెక్కుల నీటితో 14.432 మిలియన్ యూనిట్ల విద్యుత్తును జనరేట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి 35,315 క్యూసెక్కుల నీటిని జల విద్యుత్ కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతం 16.732 మిలియన్ల యూనిట్ ను ఉత్పత్తి చేస్తున్నారు. గత జూలై నెల 4వ తేదీన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయం నుంచి గంగ హారతి చేపట్టి కిందకి నీరు విడుదల చేశారు. తిరిగి రెండవసారి జూలై 20వ తేదీన 8 గేట్ల ఎత్తి కిందికి నీరు వదిలారు. ముచ్చటగా మూడోసారి ఆగస్టు నెలలో 12 వ తేదీన 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 18 అడుగుల మేర ఎత్తి సాగరకు నీరు వదిలారు.

నాలుగో సారి ఆగస్టు 29వ తేదీన 10 క్రస్ట్ గేట్లు 18 అడుగులు ఎత్తారు. ఐదో సారి తిరిగి ఈనెల 13వ తేదీన ఏడు గేట్ల ద్వారా సాగర్‌కు నీరు విడుదల చేశారు. తిరిగి ఆరోసారి ఆదివారం పది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా పది అడుగుల మేర 2,73,410 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు వదులుతున్నారు. పది రేడియల్ క్రస్ట్ గేట్లెత్తడంతో పర్యాటకుల సందడి నెల‌కొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును తిలకిస్తూ సంద‌డి చేశారు.

Leave a Reply