పుట్టగొడుగుల సాగుపై శిక్షణ

పామర్రు, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామర్రు మండలంలోని రెసిలియంట్ అగ్రి టెక్ పుట్టగొడుగుల పరిశ్రమలో మహిళలు, యువతకు పుట్టగొడుగుల సాగుపై ప్రాయోగిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. జ్యోతి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ హరిహరనాథ్ పరిశ్రమను సందర్శించి సాగు విధానాలను పరిశీలించారు. శిక్షణలో పుట్టగొడుగుల సాగు పద్ధతులు, కంపోస్ట్ తయారీ, స్పాన్ నాటడం, పంట నిర్వహణ, కోత అనంతర యాజమాన్యం, మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.

అధికారులు మాట్లాడుతూ పుట్టగొడుగుల సాగు ద్వారా మహిళలు, యువత తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే అవకాశముందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న మెళకువలను ఆచరణలో పెట్టి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు, రెసిలియంట్ అగ్రి టెక్ వ్యవస్థాపకులు ఆర్. మనోహర్, సుధ, సంస్థ సిబ్బంది, మొవ్వ, ఘంటసాల మండలాల ఏపీఎంలు పాల్గొన్నారు.